ఉస్తాద్ లేటన్నాడు….జాన్ ఫిక్సయ్యాడు

తమిళ బ్లాక్ బస్టర్ తేరిని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ చేశాక జనసేన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో పాటు ఓజికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కు వెళ్ళింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ పోలీస్ డ్రామాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద గబ్బర్ సింగ్ రేంజ్ లో అంచనాలున్నాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందనే క్లారిటీ ఇంకా లేదు కానీ తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ డిసెంబర్ 25 లాక్ చేసుకుంది.

వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న బేబీ జాన్ కు ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు అట్లీ నిర్మాణంతో పాటు నేతృత్వం వహిస్తుండగా కలీస్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఒకవేళ పవన్ కు కనక తగినంత సమయం దొరికి ఎక్కువ కాల్ షీట్లు ఉస్తాద్ కు ఇచ్చి ఉంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల చేసేలా హరీష్ శంకర్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. బేబీ జాన్ రావడం వల్ల నష్టమేమి లేదు కానీ విజయ్ తేరి తెలుగు డబ్బింగ్ నే ప్రైమ్ లో చూసేసిన ప్రేక్షకులు ఇప్పుడీ వరుణ్ ధావన్ వెర్షన్ ని కూడా చూస్తే కథ పరంగా ఉన్న ఆసక్తి, ఎగ్జైట్ మెంట్ మరింత తగ్గిపోయే రిస్క్ లేకపోలేదు.

అసలు ముందు పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోయేది హరిహర వీరమల్లు. ఆ తర్వాత ఓజికి డేట్లు ఇవ్వాలి. ఆపైనే ఉస్తాద్ భగత్ సింగ్ కు ఛాన్స్. అసలే డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖల నిర్వహణలో పవన్ కళ్యాణ్ కు పాలన తప్ప మరో ప్రపంచం లేకుండా పోతోంది. తిరిగి సినిమా సెట్స్ లో అడుగుపెట్టే మూడ్ రావాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం రాజకీయం, సినిమా రెండు బ్యాలన్స్ అయ్యేలా చూస్తున్నారట. వీటి అప్డేట్స్ లేకపోయినా పవన్ అభిమానులు మాత్రం రోజు వస్తున్న పొలిటికల్ కంటెంట్ తో మంచి హై ఆస్వాదిస్తున్నారు.