బాలీవుడ్ గాలి తీస్తున్న ప్రభాస్

ఒకప్పుడు హిందీ చిత్రాల ముందు మన సినిమాలు చాలా చిన్నగా కనిపించేవి. బాలీవుడ్ సూపర్ స్టార్ల ముందు మన హీరోలు జుజుబి అనిపించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో వ్యవహారం పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుంచి రిలీజయ్యే పాన్ ఇండియా చిత్రాల వసూళ్ల ముందు హిందీ చిత్రాల ముందు ఏమాత్రం నిలవలేకపోతున్నాయి. మన స్టార్ల ముందు బాలీవుడ్ టాప్ హీరోలు మరగుజ్జుల్లా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా ‘బాహుబలి’ దగ్గర్నుంచి ప్రభాస్ ముందు ఏ స్టార్ నిలవలేకపోతున్నాడు. ‘బాహుబలి’ తర్వాత కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఒక్క ‘సలార్’ మినహా ప్రభాస్ సినిమాలన్నీ డిజాస్టర్లే అయినా.. వాటికి ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. సాహో, ఆదిపురుష్, సలార్.. ‘బాహుబలి’కి దీటుగా ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పుడు ‘కల్కి’ వాటిని మించిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.

‘కల్కి’ ఓవరాల్ ఓపెనింగ్స్ సంగతి పక్కన పెడితే.. హిందీ మార్కెట్లోనూ ప్రభంజనం సృష్టించేలాగే కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్ల చివరి సినిమాలు తొలి రోజు అటు ఇటుగా 10-12 కోట్ల వసూళ్లు సాధిస్తే.. ‘కల్కి’ కేవలం హిందీ వరకే పాతిక కోట్ల దాకా డే-1 గ్రాస్ కలెక్షన్లు రాబట్టేలా ఉంది ఇండియాలో. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రం రూ.20 కోట్ల క్లబ్బుకు చేరువ అయ్యేలా ఉందన్నది ట్రేడ్ వర్గాల మాట.

తొలి రోజు వాకిన్స్ కూడా కలుపుకుంటే లెక్క ఈజీగా పాతిక కోట్ల మార్కును టచ్ చేసేలా ఉంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ మినహా గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ స్టార్ సినిమా కూడా తొలి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీన్ని బట్టే బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిన ఇమేజ్, మార్కెట్ ప్రభాస్‌కు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ‘కల్కి’కి కొన్ని రోజుల ముందు వరకు నార్త్ మార్కెట్లో బజ్ కనిపించలేదు కానీ.. రిలీజ్ టైంకి మాత్రం హైప్ ఆటోమేటిగ్గా వచ్చేసింది.