ప్ర‌భాస్‌ను అండ‌ర్ ప్లే చేశారెందుకు?

ఇంకో వారం రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న మెగా మూవీ క‌ల్కి 2898 ఏడీ నుంచి కొత్త ట్రైల‌ర్ వ‌చ్చింది. కొన్ని వారాల ముందే ఓ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌గా దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా వ‌చ్చి రిలీజ్ ట్రైల‌ర్ దాన్ని మించింద‌నే ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. విజువ‌ల్స్‌తో పాటు క‌థ‌లోని ఎమోష‌న్లు ఎలివేట్ అయ్యేలా ట్రైల‌ర్ క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.

ఐతే ఈ ట్రైల‌ర్ చూసిన ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంచెం నిరాశ ప‌డిన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఫ‌స్ట్ ట్రైల‌ర్లో మాదిరి ప్ర‌భాస్ ఇందులో ఎలివేట్ కాలేద‌ని.. త‌న పాత్ర‌కు సంబంధించిన షాట్స్ చాలా త‌క్కువ ఉన్నాయ‌ని.. ఎందుకు ప్ర‌భాస్‌కు ఎలివేష‌న్ ఇవ్వ‌లేద‌ని వాళ్లు సోష‌ల్ మీడియాలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే నాగి అండ్ కో ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప్ర‌భాస్ పాత్ర‌ను అండ‌ర్ ప్లే చేసి ఉండొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌ల్కికి తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినంత హైప్ ఉంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను కొత్త‌గా ఎంగేజ్ చేయాల్సిన అవ‌స‌ర‌మేమీ లేదు. ఐతే తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల క‌ల్కికి హైప్ పెంచాల్సిన అవ‌స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని విజువ‌ల్ హైలైట్స్‌ను ఈ ట్రైల‌ర్లో చూపించే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది. బాలీవుడ్లో సినిమాకు బ‌జ్ పెంచడం కోసం ప్ర‌భాస్ కంటే అమితాబ్‌ను హైలైట్ చేయ‌డానికి చూశారు.

ట్రైల‌ర్ చూస్తే హీరో ప్ర‌భాసా అమితాబా అని సందేహం క‌లిగే స్థాయిలో బిగ్ బిని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అలాగే తొలి ట్రైల‌ర్‌తో పోలిస్తే సినిమాలోని కొత్త పాత్ర‌లు, కొత్త విశేషాల‌ను మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు రిజిస్ట‌ర్ చేయ‌డానికి చూశారు. అందుకే ప్ర‌భాస్ షాట్స్ త‌గ్గాయి. సినిమాలో ఎలాగూ ప్ర‌భాస్ బాగా హైలైట్ అయ్యే ఛాన్సుంది కాబ‌ట్టి ట్రైల‌ర్ చూసి ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు.