పుష్ప-2 వాయిదాలో కొత్త కోణం

అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ మూవీ ‘పుష్ప-2’ ఆగస్టు 15 నుంచి వాయిదా పడుతోందనడంలో ఇక ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ డేట్‌కు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను షెడ్యూల్ చేయడంతోనే ఇండస్ట్రీలో కూడా ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చేసిందని అర్థమవుతోంది. ఇప్పటికే ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ చాలా కాలం ఎదురు చూశారు.

ఇప్పుడు మరోసారి వాయిదా అనేసరికి తట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా షూటింగ్ ఆలస్యం కావడమే ‘పుష్ప-2’ వాయిదాకు కారణం అయినప్పటికీ.. వేరే ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఈ నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్యాక్టర్ ఆసక్తి రేకెత్తించేదే. అల్లు అర్జున్ మీద ఇటీవల పెరిగిన నెగెటివిటీ దృష్ట్యా ఇప్పుడిప్పుడే పుష్ప-2ను రిలీజ్ చేయడం అంత మంచిది కాదనే చర్చ యూనిట్ వర్గాల్లో జరిగినట్లు సమాచారం.

ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మిత్రుడైన శిల్పా రవికి ప్రచారం చేయడం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ముందు ఈ విషయాన్ని అందరూ మామూలుగానే చూసినా.. తర్వాత అది పెద్ద వివాదంగా మారింది. మెగా అభిమానుల్లో బన్నీ మీద బాగా నెగెటివిటీ పెరిగిపోయేలా చేసిందీ పరిణామం.

ఎన్నికల ఫలితాలు వచ్చాక బన్నీ సోషల్ మీడియాకు మరింతగా టార్గెట్ అయిపోయాడు. వైసీపీ వాళ్లను ఎలా టార్గెట్ చేస్తున్నారో బన్నీని అదే స్థాయిలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక హీరో పట్ల నెగెటివిటీ ఎక్కువ అయితే ఏం జరుగుతుందో బాలీవుడ్లో ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి కొన్ని సినిమాలు ఉదాహరణగా నిలిచాయి.

అలాగే బన్నీ నెక్స్ట్ రిలీజ్ ‘పుష్ప-2’ను టార్గెట్ చేస్తారనే భయాలు టీంలో నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణల్లో సినిమా వసూళ్ల మీద ఈ నెగెటివిటీ ప్రభావం చూపుతుందని.. అందుకే కొన్ని నెలలు వేచి చూస్తే ఆలోపు అంతా సర్దుకుంటుందని.. ఆ కోణంలో సినిమాను వాయిదా వేయడం మంచిదే అనే చర్చ ‘పుష్ప-2’ టీం వర్గాల్లో జరిగినట్లు ప్రచారం లో ఉంది.