బందిపోట్ల అంతుచూసే వేటగాడు

బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఎన్బికె 109 టైటిల్ ప్రకటించకపోయినా ఇవాళ విడుదల చేసిన చిన్న టీజర్ లో కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చారు. కొన్ని నెలల క్రితమే మా సైట్ ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ సమాచారంలో బాలయ్య బందిపోట్ల అంతు చూసే వేటగాడిగా కనిపిస్తాడని చెప్పడం జరిగింది. దానికి బలం చేకూర్చేలా వీడియోలో మకరంద్ దేశ్ పాండే హీరో క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ, దుర్మార్గులకు కూడా దేవుడు కొన్ని వరాలు ఇస్తాడని, వాళ్ళ అంతు చూసేందుకు జాలి దయ లేని ఒక అసురుడు కావాలని చెప్పించడాన్ని బట్టి లైన్ చూచాయగా అర్థమవుతోంది.

అంటే కరుడు గట్టిన రాక్షసులను అంతం చేయడం ఎవరి వల్ల కాకపోతే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వాళ్ళను మించిన వాడు కావాలని బాలయ్యని రప్పిస్తారన్న మాట. ఇది ఎనభై తొంబై దశకంలో జరిగిన కథగా దర్శకుడు బాబీ రాసుకున్నట్టు టాక్ ఉంది. చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, ముఖ్యంగా విలన్లను తుదముట్టించే ఎపిసోడ్లను నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేసుకున్నట్టు వినికిడి. వీరమాస్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ బాబీ బృందం ఏదీ ఖరారు చేయలేదు. గత మూడు బ్లాక్ బస్టర్లకు మంచి పేర్లు కుదిరిన నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టు పెట్టాలని టీమ్ నిర్ణయించుకుంది.

విడుదల తేదీ ఇంకా ఖరారు కానీ ఎన్బికె 109 దీపావళి లేదా డిసెంబర్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు. జనవరిలో ఇదే సంస్థ నుంచి వస్తున్న రవితేజ మూవీ ఉండటంతో బాలయ్య దర్శనం 2024లోనే జరగనుంది. క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు కూడా ఎక్కువ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తమన్ వరుసగా నాలుగోసారి సంగీతం సమకూరుస్తుండటంతో హైప్ మాములుగా లేదు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మీద బిజినెస్ పరంగా చాలా క్రేజ్ ఉంది. రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాక వ్యాపార లావాదేవీలు పూర్తి చేస్తారు.