ఒకప్పుడు దర్శకుడిగా అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందించిన వైవిఎస్ చౌదరి వరస ఫ్లాపులతో కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. కొత్త సినిమాల ప్రీమియర్లకు కుటుంబంతో సహా దర్శనమిచ్చే ఈ కల్ట్ డైరెక్టర్ కంబ్యాక్ కావాలని అభిమానులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలిస్తూ ఇవాళ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నందమూరి తారకరామారావుని విపరీతంగా అభిమానించే వైవిఎస్ ఆయన పేరు మీద కొత్త బ్యానర్ స్థాపించి దానికి ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) అని నామకరణం చేశారు. ఇవాళ జరిగిన ఒక ఈవెంట్ లో లాంఛింగ్ కూడా అయిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే దీని మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ ని ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ కాబోతున్న కుర్రాడి పేరు కూడా ఎన్టీఆరే కావడంతో అదేమీ మార్చకుండా యధాతథంగా ప్రకటించారు. నాలుగో తరం నుంచి ఇంకో నటుడు తన చేతుల మీద పరిచయం కావడం అదృష్టంగా చౌదరి పేర్కొన్నాడు. హరికృష్ణ సినిమాలకు దూరంగా ఉన్న టైంలో లాహిరి లాహరి లాహిరి, సీతయ్య రూపంలో ఆయన్ని కొంత కాలం బిజీ హీరోగా మార్చింది వైవిఎస్ చౌదరినే.
నిజానికి తారకరత్న లాంచ్ అయినప్పుడు అతని షార్ట్ ఫామ్ ఎన్టీఆర్ అనే వచ్చేది కానీ పూర్తి పేరుతోనే చెలామణి చేశారు. మరి ఇప్పుడీ కొత్త ఎన్టీఆర్ కి ఏం చేస్తారో చూడాలి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన జానకి రామ్, హరికృష్ణ ఆశయాలు నెరవేరే విధంగా ఎన్టీఆర్ ని చూపిస్తానని చౌదరి అంటున్నాడు. ఇద్దరు బాబాయ్ లు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆల్రెడీ సెటిలైపోయి ఉన్నారు. అదే కుటుంబం నుంచి వస్తున్న కుర్రాడు ఎలా చేస్తాడో చూడాలి మరి. నిర్మాతగా వైవిఎస్ చౌదరి సతీమణి ఎలమంచిలి గీత వ్యవహరించబోతున్నారు. కొత్త ఎన్టీఆర్ బాలనటుడిగా దానవీరశూరకర్ణ (2015)లో నటించాడు.