హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంది. కారణం హం దిల్ చుకే సనమ్, దేవదాస్, పద్మావత్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డిజిటల్ డెబ్యూ ఇది. నెట్ ఫ్లిక్స్ సంస్థ వందల కోట్ల బడ్జెట్, కళ్ళు చెదిరే సెట్టింగులు, టాప్ బాలీవుడ్ క్యాస్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన తీరు ట్రైలర్ తోనే అంచనాలు పెంచింది. పైగా నాలుగైదు నెలల నుంచి ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మరి ఇంత హడావిడి చేసిన హీరామండి ఎలా ఉందో మినీ రిపోర్ట్ లో చూసేద్దాం.

స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో పాకిస్థాన్ లాహోర్ నగరపు సుప్రసిద్ధ వేశ్యావాటిక హీరామండిలో ఉన్న షాహి మహల్ పెద్ద మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) తన కూతుళ్ల (అదితిరావు హైదరి – షర్మిన్ సెగల్)తో సహా అందరినీ తన కన్నుసన్నలతో శాశిస్తు వచ్చిన నవాబులను సంతృప్తిపరుస్తూ భారీగా సంపద చేకూర్చుకుంటుంది. చిన్న కూతురు ఓ దొర కొడుకు(బహదూర్ షా)తో ప్రేమలో పడటంతో దీన్ని విచ్చినం చేయడం కోసం మల్లికా శత్రువు ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరాటాలకు ముడిపడటం హీరామండిలోని అసలు పాయింట్.

గ్రాండియర్ కు నిలువెత్తు సాక్ష్యంగా అనిపించే హీరామండిలో కట్టిపడేసే కథనం లేకపోవడం ప్రధాన మైనస్. ట్విస్టులు, పాత్రల మధ్య సంబంధాలను ముడిపెట్టిన విధానం బాగున్నప్పటికీ డిటైల్డ్ గా చెప్పాలనే సంజయ్ లీలా భన్సాలీ ఆలోచన నిడివిని విపరీతంగా పెంచేసింది. సన్నివేశాలు పరుగులు పెట్టవు. క్యారెక్టర్లను ప్రేమించి వాటికి కనెక్ట్ అయితే తప్ప ఆయన సృష్టించిన ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించడం కష్టం. సాంకేతిక విలువలు అత్యున్నంత ఉన్నాయి. ఆర్టిస్టులు ప్రాణం పెట్టారు. బోలెడు ఓపిక ఉండి భన్సాలీ అభిమానులు అయితే హీరామండిని నిక్షేపంగా సందర్శించి రావొచ్చు.