జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో ఆందోళన రేపిన మాట వాస్తవం. ఎందుకంటే ఇతని రీసెంట్ మూవీ రూల్స్ రంజన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యింది. ఆలా అని గతంలో ట్రాక్ రికార్డు బాగుందని కాదు. గోపీచంద్ హీరోగా భారీ బడ్జెట్ తో తీసిన ఆక్సిజన్ అంత సులభంగా మర్చిపోయే చేదు జ్ఞాపకం కాదు. తరుణ్, త్రిష, శ్రేయలతో చేసిన డెబ్యూ నీ మనసు నాకు తెలుసు సోసోగా ఆడింది. తమ్ముడు రవికృష్ణతో చేసిన కేడి వచ్చిందే ఎవరికీ తెలియదు.

తనే స్వయంగా నటించిన ఊలలలా ఇంకో డిజాస్టర్. సో ఇదంతా చూసి పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడటంలో న్యాయం ఉంది. ఇప్పుడు జ్యోతికృష్ణ దీన్నో సవాల్ గా తీసుకోవాలి. ఏదో ఆషామాషీ కమర్షియల్ సినిమానో రీమేక్ అయితే టెన్షన్ లేదు. కానీ హరిహర వీరమల్లు అలా కాదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి పీరియాడిక్ డ్రామా. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే బోలెడు ఖర్చు పెట్టేశారు. కొడుకు మీద మమకారం ప్లస్ నమ్మకంతో ఇప్పుడు జ్యోతికృష్ణకు వీరమల్లు బాధ్యత ఇచ్చి ఉండొచ్చు కానీ బయట నెలకొన్న అనుమానాలు బద్దలు కొట్టాల్సిన పెద్ద సవాల్ ఇద్దరి ముందూ ఉంది.

క్రిష్ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు కానీ అది ఏ స్థాయి ఉంటుందనేది చెప్పలేం. గతంలో పవన్ క్రిష్ ల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు జరిగిన పరిణామాలు వాటికి సింక్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఎంత భాగం పూర్తయ్యిందనేది ఇంకా చెప్పడం లేదు కానీ 2024 రిలీజ్ అన్నారు కాబట్టి మొదటి భాగం పూర్తయ్యే దశలోనే ఉండొచ్చు. హరిహర వీరమల్లు కనక బ్లాక్ బస్టర్ కొడితే దాంట్లో షేర్ క్రిష్ కి ఇవ్వాల్సి వచ్చినా వ్యక్తిగతంగా జ్యోతికృష్ణ కెరీర్ కు ఇది చాలా ఉపయోగపడుతుంది. కొత్త సినిమాకు కావాల్సిన ఊపిరినిస్తుంది.