50 వసంతాల ‘అల్లూరి సీతారామరాజు’

టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విశేషాలు చూద్దాం. 1954 టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ పోరాటయోధుడి గాధని తెరకెక్కించాలని పలుమార్లు అనుకున్నారు కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఓ నిర్మాత శోభన్ బాబుతో తీద్దామనుకుంటే కుదరలేదు. దేవుడు చేసిన మనుషులు సమయంలో రచయిత త్రిపురనేని మహారథి ఎంతో పరిశోధించి సేకరించిన సమాచారం ఆధారంగా అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ ని అత్యద్భుతంగా సిద్ధం చేసుకున్నారు.

70 ఎంఎం సినిమా స్కోప్ లో తీయడం ఖరీదైన వ్వవహారమే అయినా కెమెరా మెన్ విఎస్ఆర్ స్వామి సూచన మేరకు ఖర్చు ఎక్కువైనా సరే కృష్ణ సిద్ధపడ్డారు. చింతపల్లి అడవులు ఈ కథకు అనుకూలంగా ఉంటాయని గుర్తించి నటీనటులు, సాంకేతిక నిపుణులు మొత్తం 300 మందిని తీసుకెళ్లి 45 రోజుల షెడ్యూల్ ఎన్నో వ్యయప్రయాసల మధ్య చిత్రీకరించారు. తన వందో సినిమా కాబట్టి కృష్ణ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. మీడియా కవరేజ్ లో ఏవేవో కామెంట్స్ వచ్చేవి. కృష్ణ రిస్క్ చేస్తున్నారని, ఏదైనా తేడా వస్తే విమర్శలతో పాటు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని భయపెట్టారు.

తీరా చూస్తే 1974 మే 1 విడుదలైన అల్లూరి సీతారామరాజు గొప్ప విజయం సాధించింది. 17 కేంద్రాల్లో వంద రోజులు ఆడగా రీ రిలీజులోనూ ఎన్నో రికార్డులు సృష్టించింది. తెరమీద కృష్ణ విశ్వరూపం చూసి ప్రేక్షకులు మైమరచిపోయారు. శ్రీశ్రీ తదితరుల సాహిత్యంతో ఆదినారాయణరావు గారి పాటలు దేశభక్తిని రగిలింపజేశాయి. తెలుగువీరలేవరా పాటకు జాతీయ అవార్డు దక్కింది. సినిమా చూశాక ఇంతకన్నా గొప్పగా ఎవరూ తీయలేరని ఎన్టీఆర్ తన ఆలోచన విరమించుకోవడం కృష్ణ సాహసానికి తగిన ఫలితాన్ని దక్కేలా చేసింది. క్లైమాక్స్ లో కృష్ణ, రూథర్ ఫర్డ్ గా జగ్గయ్య నటన నభూతో నభవిష్యత్.

అల్లూరి సీతారామరాజు ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే కృష్ణ తర్వాత చేసిన సినిమాల్లో ఆయన్ని మాములు మనిషిగా చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడలేదు. దాంతో ఏకంగా 14 ఫ్లాపులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తిరిగి పాడిపంటలుతో ట్రాక్ లో పడ్డారు. విజయనిర్మల, గుమ్మడి, బాలయ్య, రావుగోపాల్ రావు, చంద్రమోహన్, మంజుల, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, పేకేటి శివరాం, అల్లు రామలింగయ్య ఇలా ఎందరో తమ పాత్రలకు ప్రాణం పోశారు. యాభై సంవత్సరాలు గడిచినా సరే వేరెవరూ అల్లూరిగా నటించేందుకు రిస్క్ చేయలేదంటే కృష్ణగారి ముద్ర ఎంత బలంగా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.