టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత కాబోయే వరుడు పలాష్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఇదంతా ఒకెత్తయితే, తాజాగా స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. పెళ్లి ఆగిపోయాక ఆమె చేసిన తొలి పోస్ట్ ఇదే. అది ఒక టూత్‌పేస్ట్ బ్రాండ్ ప్రమోషన్ వీడియో. కానీ, అందులో స్మృతి చేతికి ‘ఎంగేజ్‌మెంట్ రింగ్’ లేకపోవడం నెటిజన్ల కంట పడింది.
నిశ్చితార్థం జరిగి, పెళ్లి పీటల దాకా వచ్చాక చేతికి రింగ్ లేకపోవడం ఏంటి? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ యాడ్ ఎంగేజ్‌మెంట్‌కి ముందే షూట్ చేశారా? లేక తాజా వీడియోనా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. రింగ్ లేకపోవడం యాదృచ్ఛికమా లేక మనస్పర్థలేమైనా వచ్చాయా అని జనం చెవులు కొరుక్కుంటున్నారు.
దీనికి తోడు మరో షాకింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. పెళ్లి సందడి ఫోటోలు మాయమవడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే, కేవలం ఆరోగ్య కారణాల వల్లే పెళ్లి వాయిదా పడిందని, వేరే గొడవలేమీ లేవని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తున్నారు.
ఈ ఊహాగానాలపై పలాష్ తల్లి అమిత స్పందించారు. “స్మృతి, పలాష్ ఇద్దరూ మానసికంగా చాలా బాధలో ఉన్నారు. పలాష్ తన వధువును ఇంటికి తేవాలని ఎంతో ఆశపడ్డాడు. నేను కూడా గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశాను. కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేలా ఉంది. అంతా సర్దుకుంటుంది, త్వరలోనే పెళ్లి జరుగుతుంది” అని ఆమె నమ్మకంగా చెప్పారు.
పలాష్ సోదరి, ప్రముఖ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. “మా కుటుంబాలు చాలా క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది పాజిటివిటీ మాత్రమే” అని అన్నారు. కుటుంబ సభ్యులు ఎంత చెబుతున్నా, స్మృతి చేతికి రింగ్ లేకపోవడం, ఫోటోలు డిలీట్ చేయడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో స్మృతి ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates