సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2 వాయిదా పడటంతో చాలా చోట్ల అవసరమైన దానికన్నా ఎక్కువ షోలు మల్టీప్లెక్సుల్లో దీనికి కేటాయిస్తున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్ చూసిన ఆడియన్స్ ఇదేదో బాగుందంటూ వెళ్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అంతగా ఏముందంటే మమ్ముట్టి పూర్తిగా ఒక నెగటివ్ పాత్ర చేయడం హైలైట్ గా చెప్పొచ్చు. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీలోలుడు సైకో పాత్ కిల్లర్ గా హత్యలు చేయడం, దాన్ని కనిపెట్టే క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ కనుక్కున్న విస్తుపోయే నిజాలు ఇందులో ప్రధాన కథాంశం.

గతంలో స్వలింగ సంపర్కుడిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసిన మమ్ముట్టి ఈసారి ఏకంగా సైకో కిల్లర్ గా నటించడం షాకే, నాలుగు వందలకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో కొత్త జానర్ల కోసం ప్రయత్నిస్తున్న ఈ విలక్షణ నటుడు వయసును సైతం లెక్క చేయకుండా ఎనర్జిటిక్ గా కలం కవల్ లో నటించడం విశేషం. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ ని కొంచెం స్ఫూర్తిగా తీసుకున్న దర్శకుడు జితిన్ కె జొస్ స్క్రీన్ ప్లే నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ అయ్యేలోగా ప్రేక్షకులను సంతృప్తి పర్చడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.

ఇది తెలుగులో డబ్ అవుతుందో లేదో చెప్పలేం కానీ ఓటిటిలో వచ్చాక మాత్రం మనోళ్లు ఎగబడి చూడటం ఖాయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జైలర్ విలన్ వినాయకన్ ఇందులో పాజిటివ్ గా పోలీస్ వేషంలో కనిపించడం. మమ్ముట్టితో కాంబినేషన్ సీన్లు బాగా పండాయి. ఇంటెన్స్ గా డిజైన్ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటుంది. అలాని కథనం పరుగులు పెడుతుందని కాదు. మలయాళం సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు ఇది కొత్తగానే ఉంటుంది కానీ లేదంటే కొంచెం ల్యాగ్ ఫీలవ్వడం ఖాయం. ఇలాంటివి మన హీరోలు చేస్తే జనాలు అంత సులభంగా అంగీకరించరు కాబట్టి అనువాదంతో సరిపెట్టుకోవాల్సిందే.