‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు. తర్వాత కెరీర్లో అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డాడు బాలయ్య. ఐతే ఆరేళ్ల ముందు ఒకే ఏడాది యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక బాలయ్య పుంజుకోవడం కష్టం అనేశారు చాలామంది.
కానీ ‘అఖండ’తో తిరిగి భారీ విజయాన్నందుకున్న బాలయ్య.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళ్లారు. వీటి తర్వాత ‘అఖండ’ లాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ చేయడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. కావాల్సినంత హైప్ వచ్చింది. కెరీర్లో ఈ దశలో బాలయ్య ఇలాంటి హై చూస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు.
అఖండ-2తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని తొడగొట్టి చెబుతూ.. అమెరికా నుంచి అనకాపల్లి వరకు భారీ సంబరాలకు సిద్ధమయ్యారు. నెవర్ బిఫోర్ అన్న స్థాయిలో సెలబ్రేషన్లకు ఏర్పాట్లు జరిగాయి. కానీ వారి ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ ప్రిమియర్స్‌కు బ్రేక్ పడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపు మొత్తంగా సినిమా రిలీజే ఆగిపోవడంతో నందమూరి అభిమానుల వేదన మామూలుగా లేదు. ఇప్పటిదాకా బాలయ్య కెరీర్లో ఏ సినిమాకూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
ఒకే రోజు రెండు భారీ చిత్రాలు (నిప్పురవ్వ, బంగారు బుల్లోడు) సినిమాలను రిలీజ్ చేసి రెంటికీ భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఘన చరిత్ర బాలయ్య సొంతం. అలాంటిది బాలయ్య కెరీర్లో అత్యంత హైప్ ఉన్న సినిమాకు ఇలా జరగడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సంబరాలన్నీ ఆగిపోయి.. అసలు సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియని అయోమయంలో పడిపోడడంతో వారికి నోట మాట రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన బాలయ్య సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా ఎదుర్కోని బాధ ఇది.
కొన్ని నెలల ముందు పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’కు రిలీజ్ ముంగిట ఇబ్బందులు ఎదురు కావడం, బ్యాడ్ టాక్ వల్ల నిర్మాత, బయ్యర్లకు భారీ నష్టం రావడంతో అప్పుడు నందమూరి అభిమానుల్లో కొందరు నెగెటివ్ పోస్టులు పెట్టి మెగా అభిమానులను ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అసలే రిలీజ్ ఆగిపోయిన బాధలో ఉన్న వారిని.. యాంటీ ఫ్యాన్స్ మరింతగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో బాలయ్య ప్రమేయం ఏమీ లేకపోయినా, తప్పంతా నిర్మాతలదే అయినా.. ఇలా అవమాన భారాన్ని మోయాల్సి రావడాన్ని నందమూరి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates