ప్రశాంత్ వర్మ ‘రాక్షస’ ప్లానింగ్

హనుమాన్ బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరికొన్ని ఇంటరెస్టింగ్ లీక్స్ ఒక్కసారిగా హైప్ పెంచేలా ఉన్నాయి. వాటిలో మొదటిది టైటిల్. ‘రాక్షస్’ లేదా ‘బ్రహ్మరాక్షస’ పేరుతో ఒక అద్భుతమైన ఫాంటసీ కథని ఈ కాంబో కోసం సిద్ధం చేశారట. వినగానే రణ్వీర్ ఫ్లాట్ అయ్యాడని టాక్.

స్వాతంత్రం రాక ముందు అంటే 1947 పూర్వం బ్రిటిషర్ల పాలన జరుగుతున్న టైంలో జరిగిన ఒక అరుదైన సంఘటన ఆధారంగా ప్రశాంత్ వర్మ ఈ ప్లాట్ ని సిద్ధం చేశాడట. ఫైనల్ నెరేషన్ కూడా పూర్తయ్యిందని, ఇటీవలే హనుమాన్ జయంతి సందర్భంగా లాంఛనంగా ఒక పూజా కార్యక్రమం కూడా చేశారని ముంబై మీడియా రిపోర్ట్. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరో రెండు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకుంటాయని వినిపిస్తోంది. సుమారు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెడతారని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రశాంత్ వర్మకు పెద్ద ప్రమోషన్.

ఈ లెక్కన జై హనుమాన్ 2026కి షిఫ్ట్ అయినట్టే. తన ప్రతి సినిమాలోని పాత్రలను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ ద్వారా కలపబోతున్న ఈ యువ దర్శకుడు రాక్షస్ ని కూడా అందులో భాగంగానే రాసుకున్నాడట. ఇంకో రెండు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒక్క వివరం తప్ప ఇంకే డీటెయిల్స్ అందుబాటులో లేవు. ఫర్హాన్ అక్తర్ తో లాక్ చేసుకున్న డాన్ 3 ఆలస్యం కావడమో లేదా పూర్తిగా రద్దుయ్యే సూచనలు ఉండటం రణ్వీర్ సింగ్ కు నక్కతోక తొక్కినట్టు ప్రశాంత్ వర్మ కలయిక కుదరడం అదృష్టంగా ఫీలవుతున్నాడట.