కబాలి దర్శకుడి నవ్వు – రజని ఫ్యాన్స్ ఆగ్రహం

నవ్వు నాలుగు విధాలా చేటని పెద్దలు ఊరికే అనలేదు. సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించకుండా తొందరపడితే ఒక్కోసారి పరిణామాలు దూరం వెళ్లిపోతాయి. అలాంటిదే ఈ సంఘటన. కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ తెలుసుగా. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరసగా రెండు భారీ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఇతని సొంతం. కాకపోతే ఆ రెండూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం విచారకరం. దళిత భావజాలాన్ని, ఆ వర్గం మనుగడని కోరుకునే పా రంజిత్ తన ఆలోచనలను తెరమీద చూపిస్తూ ఉంటాడు. రజని అయినా సరే వాటిని అంగీకరించే స్థాయిలో కథలు రాసుకుంటాడు.

ఇటీవలే పా రంజిత్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. తమిళనాడు రాజకీయ పరిణామాలు ప్రధాన అజెండా. వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడుతూ కాలాలో రజనీకాంత్ రాజకీయాల కుళ్ళు గురించి గొప్పగా చెప్పాడని, వాటి అర్థం తెలియకుండా డైలాగులు పలికాడని, నిజ జీవితంలో ఆచరించే అవకాశం వచ్చినా పాటించకుండా పార్టీని వదులుకున్నాడని కాసింత విమర్శనాత్మక ధోరణిలో అన్నాడు. దీనికి పా రంజిత్ స్పందిస్తూ బిగ్గరగా నవ్వడం అభిమానులకు ఆగ్రహం కలిగింది. నిజానికి ఆ స్థానంలో తలైవర్ ని సమర్ధిస్తూ సినిమా, పాలిటిక్స్ రెండు వేర్వేరని చెప్పాల్సిందని వాళ్ళ వెర్షన్.

అలా డిమాండ్ చేయడంలో లాజిక్ ఉంది. ఎందుకంటే తెరమీద చేసేదంతా రియల్ లైఫ్ లో పాటించాలని రూల్ లేదు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడానికి ఆరోగ్యంతో సహా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అది వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప ఎప్పుడో వచ్చిన కాలాలో కంటెంట్ గురించి ఇప్పుడు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సాక్ష్యాత్తు దాని దర్శకుడే ఇలా నవ్వడం నిజంగా తప్పే. ఎందుకంటే తను సూపర్ స్టారయ్యాక ఒక దర్శకుడి కెరీర్ ప్రారంభంలోనే రెండు అవకాశాలు రజనీకాంత్ జీవితంలో ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే పా రంజిత్ నవ్వకుండా ఉండాల్సింది. విక్రమ్ తో చేసిన తంగలాన్ మీద ఈ ప్రభావం ఉండే ఛాన్స్ లేకపోలేదు.