బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆ వేడుకలో ఆయన సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్స్ అరవింద్‌తో పాటు బన్నీ వాసు తదితరులకు ఇబ్బంది కలిగించాయి.

వేరే వాళ్లు కష్టపడి మంచి మంచి సినిమాలు తీస్తే.. చివర్లో వచ్చి అరవింద్ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటాడంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ ఆ ఈవెంట్‌లో మంచి మూడ్‌లో ఉన్న తమ అందరినీ డిస్టర్బ్ చేశాడంటూ బన్నీ వాసు తర్వాత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఐతే అప్పుడు బండ్ల గణేష్ వ్యాఖ్యల మీద అసహనం వ్యక్తం చేసిన బన్నీ వాసు.. అప్పటి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసేలా ఇప్పుడు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘లిటిల్ హార్ట్స్’తో మొదలుపెట్టి బన్నీ వాసు, వంశీ నందిపాటి వరుసగా చిన్న సినిమాలను టేకప్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లిటిల్ హార్ట్స్‌తో పాటు రాజు వెడ్స్ రాంబాయి, ఈషా లాంటి చిత్రాలు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో ఈషా కాకుండా మిగతా రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసింది ఈటీవీ విన్ వాళ్లే.

ఇప్పుడు అదే సంస్థ ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రాన్ని కూడా బన్నీ వాసు, వంశీ నందిపాటిలే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్లో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈటీవీ విన్ వాళ్లు మంచి క్వాలిటీతో సినిమాలు తీస్తున్నారని.. ఐతే వాళ్లు ఎంతో కష్టపడి తీసిన సినిమాలను తాను చివర్లో టేకప్ చేసి రిలీజ్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నానని బన్నీ వాసు వ్యాఖ్యానించాడు.

ఈటీవీ విన్ వాళ్లు ఇక ముందు కూడా ఇలాగే మంచి సినిమాలు తీస్తూ తన లాంటి వాళ్లు ఇంకా పైకి ఎదగడానికి సహకారం అందించాలని బన్నీ వాసు అన్నాడు. అప్పుడు అల్లు అరవింద్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఏం కామెంట్ చేశాడో.. ఇప్పుడు బన్నీ వాసు తన గురించి తానే అలాంటి కామెంట్ చేయడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని’ని ముందు నేరుగా ఈటీవీ విన్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని మార్చి 6న నేరుగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.