పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంకా హక్కులు అమ్మకపోయినా ఏపీ తెలంగాణకు సంబంధించి బిజినెస్ కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు సమాచారం.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయిన పెద్ది ఇప్పుడా డేట్ అందుకునేందుకు పెద్ద ఒత్తిడిని ఎదురుకుంటోంది. ఇవాళ సెకండ్ సింగల్ అనౌన్స్ చేద్దామనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల వాయిదా వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి మినహాయిస్తే చేతిలో సరిగ్గా 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది.

ఈ రెండు నెలల కాలంలోనే బ్యాలన్స్ షూట్, స్పెషల్ సాంగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్యాన్ ఇండియా ప్రమోషన్లు అన్నీ అయిపోవాలి. అసలు ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికే ఇంకో నెలన్నర పట్టొచ్చని అంటున్నారు. దర్శకుడు బుచ్చిబాబు చాలా ఒత్తిడి మీద ఉన్న మాట వాస్తవం.

ఇంతకీ ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ ఎవరో ఇప్పటిదాకా తేలలేదు. కాంబినేషన్ సీన్లకు ఇబ్బంది లేకుండా శివరాజ్ కుమార్ తదితరులు తమ కాల్ షీట్లు అడ్జస్ట్ చేసుకుని మరీ ఇస్తున్నారు. ఇంకో పాతిక శాతం బాలన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ, ఎంత అనేది టీమ్ అధికారికంగా వెల్లడించడం లేదు. ఫ్యాన్స్ క్రమంగా అసహనానికి గురవుతున్న వైనం ఎక్స్ లో కనిపిస్తోంది.

ఒకవేళ ఏప్రిల్ 30 వదులుకునే పక్షంలో ఆ స్లాట్ ని వాడుకునేందుకు అఖిల్ లెనిన్ సిద్ధంగా ఉంది. అందుకే వాళ్ళు కూడా కొత్త డేట్ ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నారు. పెద్ది కనక ఆన్ టైం వస్తే అప్పుడు లెనిన్ వేరే ఆప్షన్ చూసుకుంటుంది. ఈ సందిగ్దత డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఇబ్బందిగా మారింది.

ఫలానా టైంలో సినిమా వస్తుందని తెలిస్తే దానికి అనుగుణంగా అగ్రిమెంట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పెద్దికున్న క్రేజ్ దృష్ట్యా అన్ని ఏరియాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. నెక్స్ట్ వదలబోయే రెండో పాటలో ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ ఉంటే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు. లేదంటే మళ్ళీ టెన్షన్ షురూ.