కృష్ణంరాజు గారి వారసుడిగా ప్రభాస్ స్థాయి ప్యాన్ ఇండియాని మించి ఎదగడం చూస్తూనే ఉన్నాం. ఫలితాలతో సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా తన సినిమాల బిజినెస్ అంతకంతా పెరుగుతూ పోతోంది తప్పించి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకో హీరో రాలేదు. తాజాగా విరాట్ రాజ్ ని తీసుకొస్తున్నారు. గౌడ్ సాబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ లాంచ్ ఇవాళ గ్రాండ్ గా జరిగింది. గెస్టులుగా పిలిచిన అతిథుల లిస్టు పెద్దగా ఉంది కానీ సుకుమార్ హాజరు మాత్రమే కనిపించింది. విరాట్ చూసేందుకు ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు.
డాన్స్ మాస్టర్ గణేష్ దీని ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. లారెన్స్ రాఘవేంద్ర, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని మెగా ఫోన్ చేపట్టాడు. విరాట్ రాజ్ ని ప్రభాస్ కజిన్ గా చెబుతున్నారు కానీ ఏ వరస, ఎలా బంధుత్వం లింక్ కుదిరిందనేది మాత్రం బయటికి చెప్పడం లేదు. కజిన్ పదాన్నే వాడుతున్నారు. 2011లోనూ ప్రభాస్ రిలేటివ్ కుర్రాడు లాంచ్ అవుతాడని తెగ ప్రచారం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ విరాట్ రాజ్ కు అలాంటి సమస్య రాకపోవచ్చు. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకుని షూటింగ్ కు వెళ్ళబోతున్నారు.
ఇదంతా ఒకే కానీ ప్రభాస్ ది రాజా సాబ్ చేస్తున్నాడు కాబట్టి అదే సౌండ్ వచ్చేలా గౌడ్ సాబ్ టైటిల్ పెట్టినట్టు ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయినా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా సరైన కంటెంట్ తో వచ్చి, మల్టీ టాలెంట్స్ తో ఆకట్టుకుంటేనే ఇక్కడ భవిష్యత్తు ఉందనే సంగతి విరాట్ కు తెలియంది కాదు. అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లే సరైన హిట్లు లేక ఓపెనింగ్స్ దగ్గరే దెబ్బ తింటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సో డార్లింగ్ బ్రాండ్ తో నెట్టుకురావడం డెబ్యూకి కొంత పని చేయొచ్చేమో కానీ మాట్లాడాల్సింది మాత్రం హిట్లే.