ఇప్పుడు నిర్మాణంలో ప్రభాస్ సినిమాలు ఎన్ని ఉన్నా అభిమానులు ఎక్కువగా దృష్టి పెడుతోంది మాత్రం స్పిరిట్ మీదే. యానిమల్ లో రన్బీర్ కపూర్ అంతటి సాఫ్ట్ హీరోని మోస్ట్ వయొలెంట్ గా చూపించి తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగా, మాస్ ఐకాన్ గా చెప్పుకునే డార్లింగ్ ఏ స్థాయిలో ప్రెజెంట్ చేస్తాడోనని విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలుకాకపోయినా స్క్రిప్ట్ ని తుది దశకు తీసుకొచ్చిన ఈ కల్ట్ డైరెక్టర్ త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తానని అంటున్నాడు. ఇటీవలే ఒక వెబ్ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు చెప్పాడు.
స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టరైజేషన్ తన ఆలోచనలకు, హీరో వ్యక్తిత్వానికి, ఆవేశానికి మ్యాచ్ అయ్యేలా ఉంటుందని సందీప్ అంటున్న మాట. డ్యూటీ చేస్తున్న క్రమంలో దానికి అడ్డొచ్చేలా ఏదైనా జరిగినప్పుడు, తన సిద్ధాంతానికి భిన్నంగా తప్పుని గుర్తించినప్పుడు ఖాకీ దుస్తుల్లోని మృగాన్ని తెస్తే ఎలా ఉంటుందో అలా స్పిరిట్ ని చూస్తారట. అంటే రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో కాకుండా సందీప్ మార్క్ ట్రీట్ మెంట్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. సలార్ లో ఎంత హీరోయిజం ఉన్నా ఫ్యాన్స్ ని ఫుల్ మీల్స్ భావన పూర్తిగా కలగలేదు.
దాన్ని పూర్తిగా స్పిరిట్ తీర్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి ఫినిషింగ్ పనుల్లో ఉన్నాడు. అది కాగానే ది రాజా సాబ్ సెట్స్ కి వెళ్ళిపోతాడు. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంకు ప్రశాంత్ నీల్ నుంచి సిగ్నల్ రాగానే దానికి డేట్స్ ఇస్తాడు. ఇంకోపక్క హను రాఘవపూడి మూడు పాటలు రికార్డింగ్ చేయించి కొత్త ప్రాజెక్టు కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యేలోపు ఇంకో ఏడాది పడుతుంది కానీ మధ్యలో వచ్చే గ్యాప్ లోనే స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. యానిమల్ నిర్మించిన టి సిరీస్ నిర్మాణ భాగస్వామ్యంలోనే రూపొందనుంది. ఇదయ్యాక యానిమల్ పార్క్ తెరకెక్కుతుంది.