జనవరిలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా సక్సెసయ్యిందని చెప్పడానికి నిర్వహించిన ప్రెస్ మీట్ కి నిర్మాత నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వచ్చారు కానీ అసలైన మాటల మాంత్రికులు దర్శనం ఇవ్వలేదు. ఫలితం గురించి అర్థం చేసుకునే మీడియాకు దూరంగా ఉన్నారని, సోషల్ మీడియా ట్రోలింగ్ ని ఆయన దృష్టికి స్నేహితులు తీసుకెళ్లడంతో వాటిని చూసి హర్ట్ అయ్యారని వినిపించింది కానీ ఏదైనా అడగాలంటే అసలు అందుబాటులోకి వస్తేగా. మహేష్ బాబు మూవీకి ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం విశేషం.
సరే ఇదంతా గతమనుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి అడుగు ఏంటో అభిమానులకే కాదు ఎవరికీ అంతు చిక్కడం లేదు. అల్లు అర్జున్ తో ఆల్రెడీ ఒక ప్యాన్ ఇండియా మూవీని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది ఇప్పట్లో మొదలయ్యే సూచనలు లేవు. ఎందుకంటే స్క్రిప్ట్ సిద్ధం కావాలి. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి, బడ్జెట్, క్యాస్టింగ్, ప్రొడక్షన్ హౌస్ ఇలా సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. అటు బన్నీ పుష్ప 2 ది రూల్ పూర్తి కాగానే అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖరారైనట్టే. సో జులాయితో మొదలైన హ్యాట్రిక్ కాంబో ఇంకోసారి రిపీట్ కావాలంటే ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
ఇంకోవైపు న్యాచురల్ స్టార్ నానితో త్రివిక్రమ్ ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వచ్చినా అది కూడా ఆన్ లైన్ వార్తలకే పరిమితమయ్యింది కానీ నిజానికి అలాంటి ఆలోచనే లేదని నాని లైనప్ చూస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం కమర్షియల్ గా ఎంత పే చేసినా కంటెంట్ విషయంలో దాని మీద వచ్చిన క్రిటిసిజంని ఎవరూ కాదనలేరు. ఇంత అనుభవమున్న త్రివిక్రమ్ కు అది తెలియంది కాదు. కాకపోతే అల వైకుంఠపురములో తర్వాత వచ్చినంత గ్యాప్ మళ్ళీ రాకుండా వీలైనంత త్వరగా ఒక మంచి ఎంటర్ టైనర్ తో రావాలని ఫ్యాన్స్ కోరిక.