గోపీసుందర్‌కు ఏమైంది?

గోపీసుందర్.. తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న మలయాళ మ్యూజిక్ డైరెక్టర్. నిన్ను కోరి, మజిలీ, గీత గోవిందం లాంటి చిత్రాల్లో గోపీసుందర్ పాటలను అంత సులువుగా మరిచిపోలేం. హృద్యమైన ప్రేమకథలకు వీనుల విందైన పాటలు అందించడంలో తన ప్రత్యేకతే వేరు. మలయాళంలో కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసినా.. తెలుగు సినిమాల్లో ఉండే రీచ్ వల్ల తనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన సినిమాల్లో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా మంచి ఫీల్‌తో సాగుతుంది.

ఐతే కొత్త తరహా పాటలు, నేపథ్య సంగీతం ఇస్తాడని పేరున్న గోపీసుందర్.. ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో మాత్రం ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాటల విషయంలో మొదలైన నెగెటివిటీ.. సినిమాలో నేపథ్య సంగీతం విన్నాక ఇంకా పెరిగిపోయింది.

‘ఫ్యామిలీ స్టార్’లో కళ్యాణి వచ్చా వచ్చా, మధురము కదా పాటలు వినసొంపుగా ఉన్నప్పటికీ.. వాటికి కాపీ మరకలు అంటాయి. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్‌కు చాలా దగ్గరగా ‘కళ్యాణి’ పాట అనిపిస్తే.. మధురము కదా అంటూ సాగే మరో పాట ‘దిల్ సే’ మూవీలోని ‘జియా చలే’ సాంగ్‌కు కాపీలా అనిపించింది. దీంతో అతను ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లందరూ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గోపీని తిట్టిపోస్తున్నారు. సన్నివేశాలతో సంబంధం లేకుండా నాన్ సింక్‌లో సాగిన బీజీఎం ప్రేక్షకులకు పిచ్చెక్కించేసింది. రవిబాబుతో ఫైట్ సీన్లో అయితే సంస్కృత శ్లోకాలతో నడిచే బీజీఎం అయితే భరించలేని విధంగా తయారైంది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎక్కడా కూడా బీజీఎం సింక్‌లో సాగలేదు. మిగతా సినిమాలో కూడా చాలా చోట్ల స్కోర్ తేడా కొట్టింది. దీంతో గోపీసుందర్ లాంటి మంచి సంగీత దర్శకుడికి ఏమైందని సంగీత ప్రియులు చర్చించుకుంటున్నారు.