అదుర్స్ 2….జరిగే పనేనా చారీ

జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన అదుర్స్ ని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతారు. డ్యూయల్ రోల్ లో ఒక పాత్ర రొటీన్ గా ఉన్నప్పటికీ చారిగా తారక్ చూపించిన టైమింగ్, వేషభాషలు, బ్రహ్మనందంతో కలిసి చేసిన అల్లరి, డైలాగులు పలికిన విధానం ఒకటేమిటి అన్ని అంశాలు దాన్ని బ్లాక్ బస్టర్ దిశగా తీసుకెళ్లాయి. దర్శకుడు వివి వినాయక్ పనితనంతో పాటు రచయిత కోన వెంకట్ కలం బాగా పని చేశాయి. ఇదంతా 2010 నాటి కథ. పధ్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. దీనికి సీక్వెల్ కావాలనే డిమాండ్ కూడా మరుగున పడింది.

తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోన వెంకట్ తో మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. నిరాహార దీక్ష చేసైనా సరే అదుర్స్ 2 చేసేలా జూనియర్ ఎన్టీఆర్ ని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చారి క్యారెక్టర్ ని ఇండియాలో అంత గొప్పగా ఏ నటుడూ పోషించలేడని, అందుకే కొనసాగింపు కావాలని అభిమానులతో పాటు తనకు ధృడ సంకల్పం ఉందని చెప్పుకొచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ ఇదంత సులభంగా తేలే మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ నుంచి తారక్ ఇమేజ్ ప్యాన్ ఇండియా రేంజ్ కి పెరిగిపోయింది.

ఏ సినిమా చేసినా బహు భాషల్లోకి వెళ్తోంది. కేవలం తెలుగు నేటివిటీని దృష్టిలో పెట్టుకుంటే లాభం లేదు. అలాంటప్పుడు అదుర్స్ లాంటి వినోదాత్మక కథలతో నార్త్ సైడ్ వాళ్ళను మెప్పించడం చాలా కష్టం. పైగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వివి వినాయక్ అదుర్స్ 2 అయ్యేపని కాదని, వదిలేయాలని చెప్పాడు. పైగా ఫామ్ లో కూడా లేడాయే. ఇప్పుడు కొత్త దర్శకుడిని సెట్ చేసుకుని, బడ్జెట్ పెంచుకుని, అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యేలా రాసుకోవడమంటే కొండంత బరువు. ఏదో ఫ్లోలో అనేసుకోవడం తప్ప అదుర్స్ మేజిక్ ని రిపీట్ చేయడం అంటే పెద్ద సవాల్ లాంటిది.