టాప్ స్టార్ల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ల మీద భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడానికి, స్టార్ ఇమేజ్ పెంచుకోవడానికి వారసత్వ హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలు చేయడం, ఎలివేషన్ల కోసం ప్రయత్నించడం చూస్తుంటారు. ప్రతిదీ అభిమానులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు. కానీ అక్కినేని కుర్రాడు నాగచైతన్య మాత్రం ఇందుకు భిన్నం.
అతను ఎప్పుడూ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోలేదు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు, క్లాస్ మూవీస్‌తోనే హిట్లు కొట్టాడు. మాస్ సినిమాలు అప్పుడప్పుడూ ట్రై చేసినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ అతను ఆ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు. తన సినిమాల్లో కూడా ఎలివేషన్లు, ఫైట్లు, డ్యాన్సులు అని లెక్కలేసుకుని ఫార్ములా సినిమాలు చేయలేదు. బయట కూడా అతను పెద్దగా బిల్డప్‌లు ఇవ్వడు. ఎంతో అణకువతో వ్యవహరిస్తుంటాడు.
తన సినిమాల్లో కథను బట్టి వెళ్లిపోతాడే తప్ప.. ఇమేజ్ లెక్కలు వేసుకోడని పలుమార్లు రుజువైంది. తాజాగా తన నుంచి రాబోతున్న ‘వృషకర్మ’ విషయంలో చైతూ ఇంకా బోల్డ్ స్టెప్ వేస్తున్నాడని అర్థమవుతోంది.
గురువారం రిలీజైన ‘వృషకర్మ’ టీజర్లో.. నాగచైతన్య పాత్రను బాగా అండర్ ప్లే చేశారు. టీజర్లో కాన్సెప్ట్‌ను, విలన్‌ను హైలైట్ చేయడానికే చూశారు. టీజర్ మొదలైంది విలన్ పాత్ర మీదే. సగం వరకు అతనే హైలైట్ అయ్యాడు. తర్వాత చైతూ రంగంలోకి దిగాడు. అప్పుడు కూడా చైతూకు, తన పాత్రకు మరీ బిల్డప్ ఏమీ ఇవ్వలేదు.
మొత్తంగా టీజర్లో కాన్సెప్ట్, విలన్ క్యారెక్టర్, విజువల్స్, కథా నేపథ్యాన్ని చూపించే వరల్డ్ హైలైట్ అయ్యాయి తప్ప.. చైతూ మీదికి ఎక్కువ ఫోకస్ వెళ్లలేదు. ఇదే విషయమై చైతూను అడిగితే.. తాను దర్శకుడు కార్తీక్ దండు విజన్‌ను నమ్మి అందుకు తగ్గట్లుగా ముందుకు వెళ్లిపోయానని.. తాను హైలైట్ కావాలని అనుకోలేదని చెప్పాడు.
అలా లెక్కలేసుకుని చేసిన సినిమాల విషయయంలో కొన్నిసార్లే విజయవంతం అయ్యారని.. చాలాసార్లు ప్రతికూల ఫలితాలే వచ్చాయని.. కాబట్టి కథకు ఏది అవసరమో అది చేయడమే తనకు ముఖ్యం అని.. అందుకే తన గురించి ఆలోచించలేదని చెప్పాడు. చైతూ మిగతా హీరోలకు భిన్నం అనడానికి ఇది ఉదాహరణ. ఈ విషయంలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates