పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనుకున్న దాని కంటే వారం ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్చి 26 నుంచి 19కి ఈ చిత్రం ప్రిపోన్ అయింది. ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ వాయిదా పడినట్లు వార్త బయటికి వచ్చిన 24 గంటల్లోనే ఈ సినిమాకు కొత్త డేట్ ఇవ్వడం విశేషం.
‘ఉస్తాద్’ లాంటి పెద్ద సినిమాలను వాయిదా వేయడం కామనే కానీ.. అనుకున్న దాని కంటే వారం ముందుకు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ‘టాక్సిక్’ రాదని తెలియగానే ఆలస్యం చేయకుండా చకచకా ప్రి పోన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సంగీత దర్శకుడు తమన్‌తో బీజీఎం కూడా చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఉదయం ‘టాక్సిక్’ గురించి వార్త వస్తే.. సాయంత్రానికి తమన్ బీజీఎం గురించి అప్‌డేట్ ఇచ్చారు. నిన్న ‘ఉస్తాద్..’ కొత్త రిలీజ్ డేట్ గురించి వెల్లడించారు. ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుని అమల్లో పెట్టడం ఆషామాషీ విషయం కాదు.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ప్రిపోన్ చేయడం వల్ల చాలా ప్రయోజనమే ఉండబోతోంది. ఈ సినిమా వచ్చాక మూడు వారాల పాటు పేరున్న చిత్రాలేవీ విడుదల కావు. మార్చి మూడో వారం నుంచి దశల వారీగా పరీక్షలు ముగించుకుని విద్యార్థులు ఖాళీ అవుతారు. సినిమాలకు వరుస కడతారు. ఇక రెగ్యులర్ సినీ గోయర్స్ ఎలాగూ సినిమా చూడ్డానికి సిద్ధంగానే ఉంటారు. మార్చి చివరి రెండు వారాలు ‘ఉస్తాద్..’కు ఎదురే ఉండదు. ఏప్రిల్లోనూ పదో తారీఖు ‘డెకాయిట్’ వచ్చే వరకు ఏ ఇబ్బందీ ఉండదు.
కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. మూడు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకోవచ్చు. మరి ఇంత అనుకూలమైన సమయంలో వస్తున్న ‘ఉస్తాద్..’ టీం ఎలాంటి కంటెంట్ ఇస్తుందో చూడాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. పోలీస్ పాత్ర చేసిన పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించగా.. దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీతం సమకూర్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates