తెలుగు పండగ మీద కన్నేసిన కాంతార 1

పెద్దగా అంచనాలు లేకుండా కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ లోపే రూపొంది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ గా కాంతార విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా విడుదలైనా సరే ఇక్కడా సంచలన విజయం అందుకోవడం అనూహ్యం. చేతికి దాక వచ్చిన డబ్బింగ్ హక్కులను నమ్మకం లేక వదిలేసుకున్న కొందరు నిర్మాతలకు రోజుల తరబడి నిద్ర రాలేదన్నది వాస్తవం. కెజిఎఫ్ తర్వాత ఒక కన్నడ సినిమా ఆ స్థాయిలో టాలీవుడ్ లో భారీ సక్సెస్ కావడంతో దీనికే చెల్లింది. ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

కాంతార చాఫ్టర్ 1 పేరుతో అసలు కథ ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నాడు హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి. హోంబాలే ఫిలింస్ ఎలాంటి బడ్జెట్ పరిమితులు లేకుండా భారీగా ఖర్చు పెడుతోంది. బెంగళూరు మీడియా టాక్ ప్రకారం వంద కోట్ల పైమాటేనని తెలిసింది. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలున్నట్టు సమాచారం. మాములుగా శాండల్ వుడ్ ఈ పండగను సీరియస్ గా తీసుకోదు. తెలుగు, తమిళం నుంచి రిలీజయ్యే స్టార్ హీరోల సినిమాల తాకిడి తట్టుకోలేక వదిలేస్తూ ఉంటారు.

కానీ ఈసారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ కాంతార 1ని జనవరిలో తెచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయట. ఇప్పటిదాకా ఆ సీజన్ ని అఫీషియల్ గా లాక్ చేసుకున్నది చిరంజీవి విశ్వంభర మాత్రమే. వెంకటేష్, నాగార్జునలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. బాలయ్య బాబీది ఒకవేళ 2024 మిస్ అయితే అది కూడా రేస్ లో ఉంటుంది. వీటి మధ్య కాంతార 1 నెగ్గుకురావడం అంత సులభం కాదు. కానీ ఈ చిత్రానికున్న కల్ట్ ఫాలోయింగ్ తట్టుకుంటుందని రిషబ్ శెట్టి నమ్ముతున్నాడట. ఊహించలేని సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తానని చెబుతున్న ఈ విలక్షణ నటుడు అన్నంత పని చేస్తాడేమో.