పవన్ సినిమాల్లో దీని లెవెలే వేరు..

రీఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరే వేరుగా ఉంది. ఏకంగా నాలుగు సినిమాల్ని లైన్లో పెట్టాడాయన. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి రెండు సినిమాలు పూర్తయ్యేవి. అందులో ఒకటి రిలీజై, ఇంకోటి విడుదలకు సిద్ధంగా ఉండేది. కరోనా వల్ల బ్రేక్ పడినా పవన్ ఏమీ ఆగట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమా ఒప్పుకుంటున్నాడు. వాటికి ప్రణాళికలు రెడీ అయిపోతున్నాయి.

ఈ నెలాఖర్లోనే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పున:ప్రారంభం కాబోతుండగా.. ఆ తర్వాత క్రిష్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆపై హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఐతే ఈ నాలుగు చిత్రాల్లో రేంజ్ పరంగా పెద్దదిగా కనిపిస్తున్నది క్రిష్ చిత్రమే కావడం విశేషం. హరీష్ శంకర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. క్రిష్ సినిమా మాత్రం కథ, మేకింగ్, ఇతర ప్రమాణాల పరంగా పెద్ద రేంజిలో ఉండబోతోందని చిత్ర వర్గాల సమాచారం.

పవన్-క్రిష్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది. ఆ కథ కూడా అన్ని భాషల వాళ్లకూ కనెక్టయ్యేలా ఉంటుందట. ఇంతకుముందు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని పవన్ హిందీలో కూడా రిలీజ్ చేశాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే క్రిష్ సినిమాను ట్రూ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కించనున్నారట. క్రిష్‌ ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేశాడు. అతను ఉత్తరాది ప్రేక్షకులకు బాగానే పరిచయం.

ఇప్పుడు మంచి కథతో పవన్ లాంటి పెద్ద స్టార్‌ను పెట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు. అలాగే ఇందులో ఓ బాలీవుడ్ నటుడిని ప్రతినాయకుడిగా తీసుకోబోతున్నారట. ఇక ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని.. ‘ఆక్వామ్యాన్’ సహా కొన్ని భారీ చిత్రాలకు పని చేసిన బెన్ లాక్ ఈ చిత్రానికి పని చేయబోతున్నాడని.. ఈ సినిమా బడ్జెట్ కూడా రూ.100 కోట్ల పైమాటే అని.. ఇలా ఏ రకంగా చూసినా ఆ సినిమా రేంజ్ వేరుగా ఉండబోతోందని అంటున్నారు. ‘ఖుషి’ నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.