ఒక దర్శకుడి తొలి సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే వెంటనే అవకాశాలు వరుస కట్టేస్తాయి. రెండో సినిమా కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎన్నో ఏళ్ల నుంచి రాసుకుంటున్న కథలను వరుసబెట్టి పట్టాలెక్కించేస్తుంటారు తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకులు. ఐతే ‘ఉప్పెన’తో సంచలనం రేపిన బుచ్చిబాబు సనా మాత్రం మూడేళ్ల తర్వాత కూడా తన రెండో చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
అలా అని అతడికి అవకాశాలు లేక కాదు. రెండో సినిమాను ముందు జూనియర్ ఎన్టీఆర్‌తో కమిటయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దయింది. తర్వాత రామ్ చరణ్‌తో సినిమా ఓకే అయింది. కానీ ఇది పట్టాలెక్కడంలోనూ చాలా ఆలస్యం జరిగింది. స్క్రిప్టు సహా అన్నీ రెడీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ అందుబాటులోకి రాకపోవడంతో సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు.
చరణ్‌తో సినిమా ఓకే అయ్యాక కూడా ఏడాది పైగా ఎదురు చూపులు తప్పలేదు బుచ్చిబాబుకు. ఐతే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించబోతోంది. చరణ్‌తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20న ఈ సినిమాకు ప్రారంభోత్సవ వేడుక నిర్వహించబోతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.
చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో జాన్వి కపూర్ కథానాయికగా నటించబోతున్న విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం సమకూరుస్తాడు. ‘ఉప్పెన’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనుంది. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో చరణ్ త్వరలోనే బుచ్చిబాబు మూవీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates