బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం కిందట వచ్చిన ‘సుల్తాన్’ భారీ విజయాన్నందుకోగా.. ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఆయనకు రాలేదు. టైగర్ జిందా హై లాంటి కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. అవి కూడా పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన ‘సికందర్’ సల్మాన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశలన్నీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ మీదే నిలిచాయి.
దేశ సరిహద్దుల్లో పరిణామాల నేపథ్యంలో ‘యురి’ సహా కొన్ని చిత్రాలు భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో అదే తరహాలో గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అపూర్వ లఖియా. కానీ ‘యురి’లా ఇది మ్యాజిక్ చేసే అవకాశం లేదని.. గత ఏడాది టీజర్ లాంచ్ అయినపుడే అర్థమైపోయింది.
టీజర్ కృత్రిమంగా.. వాస్తవ ఘటనను మరీ ఎగ్జాజరేట్ చేసినట్లుగా అనిపించడంతో నెగెటివిటీ తప్పలేదు. సల్మాన్ ఖాన్ లీడ్ క్యారెక్టర్‌కు సూట్ కాలేదనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. మరోవైపు ఈ సినిమా మీద చైనా మీడియా ధ్వజమెత్తడం.. చైనా నుంచి బెదిరింపులు కూడా వచ్చాయన్న నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ‘మాతృభూమి’గా మార్చారు. చైనాకు భయపడి టైటిల్ మార్చారనే చర్చతో సినిమా మీద మరింత నెగెటివిటీ ముసురుకుంది.
ఇవన్నీ పక్కన పెడితే.. సినిమా తీసిన దర్శకుడి ట్రాక్ రికార్డు చూసి సల్మాన్ ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి కళాఖండం తీసిన దర్శకుడు అపూర్వ. ఆ తర్వాత కూడా అతడి నుంచి గొప్ప సినిమాలేవీ రాలేదు. ఈ సినిమాను ఈపాటికే రిలీజ్ చేయాల్సింది కానీ.. రీషూట్లు, నెగెటివిటీ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేసినా.. గొప్ప ఫలితమేమీ రాకపోవచ్చని, ఓపెనింగ్స్ కూడా కష్టమే అని మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సల్మాన్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates