హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది. తన సినిమాల కంటెంట్ వల్లే కాక మరి కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో ఆయన మీద తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన చేసిన కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు.

ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా అనిపించిందంతే. ఇందులోని కొన్ని డైలాగుల మీద సామాజిక మాధ్యమాల్లో చాలా కౌంటర్లు కూడా పడ్డాయి. ఈ సినిమాను కాపాడితే పవనే కాపాడాలి అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఐతే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మెజారిటీ ఇవేవీ పట్టించుకోవట్లేదు.

హరీష్ శంకర్ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో హరీష్‌ను ఎటాక్ చేసేవాళ్లకు ఎదురెళ్లి ఆ దర్శకుడికి రక్షణగా నిలుస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ అన్న ప్రచారాల నేపథ్యంలో ఒకప్పుడు హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ కూడా వ్యతిరేకత చూపిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

పవన్ సినిమాలు మేకింగ్ దశలో ఉండగా ఎన్ని కామెంట్లు చేసినా.. రిలీజ్ టైమ్‌కి పవర్ ఫ్యాన్స్ మారిపోతుంటారు. అందులోనూ హరీష్ శంకర్ వాళ్లకు చాలా చాలా స్పెషల్. ఒకప్పుడు పవన్‌కు సరైన విజయాలు లేని టైంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన ఘనత హరీష్‌దే.

సినిమా హిట్టవడం కంటే.. తాము పవన్‌ను ఎలా చూడాలనుకుంటే అలా చూపించాడని అతణ్ని ఆకాశానికెత్తేస్తుంటారు. హరీష్‌ను తమలో ఒకడిగా భావిస్తారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం హరీష్ ఎన్నేళ్లు వెయిట్ చేశాడో.. ఎన్ని త్యాగాలు చేశాడో.. ఎంత నష్టపోయాడో అందరికీ తెలుసు.

ఐదేళ్ల ముందు అనుకున్న సినిమా ఇప్పటికి రిలీజవుతోంది. మధ్యలో ఒక ఏడాది పాటు ‘మిస్టర్ బచ్చన్’ కోసం వెచ్చించాడు కానీ.. మిగతా టైమంతా పవన్ సినిమా కోసమే పెట్టాడు. పవన్ కొన్నేళ్ల పాటు అందుబాటులోకి రాకపోయినా ఓపిగ్గా ఎదురు చూశాడు. అభిమానుల వ్యతిరేకత చూసి ముందు అనుకున్న ‘తెరి’ రీమేక్‌ను పక్కన పెట్టి సొంత కథ రాశాడు.

పవన్ గత ఏడాది అందుబాటులోకి వచ్చాక రేయింబవళ్లు కష్టపడి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. సినిమా ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. అభిమానులను దృష్టిలో ఉంచుకునే ‘ఉస్తాద్’ను కూడా తీర్చిదిద్ది ఉంటాడనడంలో సందేహం లేదు. అందుకే గతంలో హరీష్‌ను ఎన్ని కామెంట్లు చేసినా, ఆయనతో తగవులు కూడా పెట్టుకున్నా.. రిలీజ్ ముంగిట మాత్రం ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తూ, సినిమాను భుజాల మీద మోసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ అభిమానులు.