పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేస్తారని ముందు ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలిపోయింది. ఏపీలో రిలీజ్ రోజు తెల్లవారుజామున 5 గంటలకు స్పెషల్ షోలు పడబోతున్నాయి. తెలంగాణలో కూడా అదే తరహాలో షోలు ఉంటాయని అనుకున్నారు. తీరా చూస్తే అవేవీ లేవని తేలిపోయింది. ఉదయం 7-7:30 మధ్య షోలు పడుతున్నాయి.
ఏపీలో 5 గంటల షోలకు రూ.500 ఫ్లాట్ రేట్ పెట్టారు. రెగ్యులర్ షోలకు రూ.100-125 మధ్య రేట్లు పెంచారు. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి పెంపు లేదు. నార్మల్ రేట్లతో సినిమా రిలీజవుతోంది. ఐతే దీని గురించి అప్‌డేట్ ఇస్తూ.. సోషల్ మీడియాలో అనేక హ్యాండిల్స్ నుంచి పెట్టించిన పోస్టులు విడ్డూరంగా ఉన్నాయి.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాతలు ప్రేక్షకుల కోణంలో ఆలోచించి రేట్లు పెంచలేదని.. సాధారణ రేట్లతోనే పవన్ సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారని.. ఇది అభినందనీయ నిర్ణయమని ఈ పోస్టుల్లో పేర్కొంటున్నారు.
ఐతే నిర్మాతలకు ప్రేక్షకుల మీద అంత ప్రేమ ఉన్న మాట నిజమైతే.. ఏపీలో కూడా సాధారణ రేట్లతోనే సినిమా చూపించాలి. కేవలం తెలంగాణ ప్రేక్షకుల మీద మాత్రమే ఈ ప్రత్యేక ప్రేమ ఏంటి అన్నది ప్రశ్న. వాస్తవం ఏంటి అంటే.. తెలంగాణలోనూ స్పెషల్ షోలు, అదనపు రేట్ల కోసం ప్రయత్నం చేశారు. కానీ ఏడాదిగా ఈ రేట్లు పెంపు వ్యవహారం ప్రభుత్వానికి కూడా తలపోటుగా మారి, కోర్టు కేసుల పంచాయితీ తప్పలేదు.
ఇటీవల సుప్రీం కోర్టు ఈ రేట్ల పెంపు విషయంలో సానుకూల తీర్పే ఇచ్చినప్పటికీ.. మళ్లీ రేట్లు పెంచితే ఇంకేం కేసులు పడతాయో అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో ఒక కొత్త పాలసీ తెచ్చే ఉద్దేశంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ లోపు ‘ఉస్తాద్..’ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి ‘రాజాసాబ్’ సినిమా రేట్ల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూసి చాలా నష్టపోయింది మైత్రీ సంస్థ.
దాని వల్ల బుకింగ్స్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ‘ఉస్తాద్..’ జీవో కోసం కూడా ట్రై చేశారు కానీ.. అది అనుకున్నంత వేగంగా వస్తుందన్న ఆశలు లేకపోవడంతో దాని కోసం చూసి బుకింగ్స్ దెబ్బ తీసుకోవడం ఎందుకని మేకర్స్ వెనక్కి తగ్గినట్లున్నారు. అవకాశం లేక రేట్లు పెంచలేదన్నది వాస్తవం. నార్మల్ రేట్లకు అసలు కారణం అదే తప్ప.. ప్రేక్షకుల మీద ప్రేమ కాదన్నది స్పష్టం.
Gulte Telugu Telugu Political and Movie News Updates