హనుమాన్ సినిమా సంచలనాల గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం. ఒక చిన్న హీరోను పెట్టి మూడు సినిమాల అనుభవమున్న దర్శకుడు పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా సంక్రాంతి చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం అసాధారణ విషయం. ప్రస్తుతానికి 2024లో ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఆ చిత్రమే.
విడుదలైన నెల రోజులు దాటినా ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగియలేదు. ఆరో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ముందు నుంచే ఈ సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరింత మంది జనానికి సినిమాను చేరువ చేయడానికి, ఇంకొన్ని రోజులు రన్ కొనసాగించడానికి టికెట్ల ధరలను ఇంకా తగ్గించారు. మల్టీప్లెక్సుల్లో 150, సింగిల్ స్క్రీన్లలో 100కే సినిమా చూసే అవకాశం లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రేట్లు వర్తిస్తాయి.
నిజానికి ఇలా రేట్లు తగ్గించడం ఆదాయం పెంచుకోవడానికి కాదు. ఇంత తక్కువ రేట్లతో వచ్చే ఆదాయం నామమాత్రమే. ఇక్కడ అసలు ఉద్దేశం వేరు. వీలైనంత ఎక్కువమందికి హనుమాన్ సినిమాను చూపించడమే టీం లక్ష్యంగా కనిపిస్తోంది. మార్చి తొలి వారంలో హనుమాన్ ఓటీటీలోకి వస్తోంది. జీ5 ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అప్పుడు కూడా ప్రమోషన్ గట్టిగా చేయబోతున్నారట. థియేట్రికల్ రిలీజ్ తరహాలో ఆన్ లైన్ పబ్లిసిటీ ఉంటుందని సమాచారం.
ఇదంతా వీలైనంత ఎక్కువమంది హనుమాన్ సినిమా చూసేలా చేసి సీక్వెల్‌కు హైప్ పెంచాలన్నది టీం ఉద్దేశం. హనుమాన్ చూసి మెచ్చిన వాళ్లందరూ సీక్వెల్ చూడాలనుకుంటారు. హనుమాన్ కంటే భారీగా తెరకెక్కనున్న జై హనుమాన్‌ను బిగ్ స్క్రీన్ల మీదే చూడాలని జనం అనుకుంటారు. ఆ రకంగా హనుమాన్ రేంజ్, దాని హైప్ వేరే స్థాయికి చేరుకుంటాయి. అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.