జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి చ‌నిపోవ‌డానికి ముందు..

విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో అల‌రించారు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోనూ ఆయ‌న త‌న‌దైన శైలిలో వినోదం పండించారు. ఆయ‌న ఇంకా చాలా ఏళ్ల పాటు ఇలాగే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ ఉంటార‌ని ఆశించారంద‌రూ.

జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి అనారోగ్యం అన్న వార్త‌లు కూడా ఈ మ‌ధ్య వినిపించ‌లేదు. అలాంటిది ఉన్న‌ట్లుండి ఇలా గుండెపోటుతో క‌న్నుమూస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇది అంద‌రికీ పెద్ద షాకే. మ‌రి ఆయ‌న‌ చ‌నిపోవ‌డానికి ముందు అస‌లేం జ‌రిగింది అన్న ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉద‌యించింది. దీనికి జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి స‌తీమ‌ణి రాధ స‌మాధానం ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంగ‌ళ‌వారం ఉద‌యం అస‌లేం జ‌రిగిందో వివ‌రించారు.

‘‘ఆయ‌న ఈ రోజు ఉదయం 3.30 గంటలకు నిద్రలేచారు. త‌నకు ఏదైనా అసౌక‌ర్యంగా ఉంద‌న్న‌ట్లు ఏమీ చెప్ప‌లేదు. నొప్పి అన‌లేదు. లేచిన కాసేప‌టికే పిల్లలతో మాట్లాడాలి అన్నారు. ఇప్పుడే ఎందుకు.. ఆరు గంటల సమయంలో మాట్లాడదామ‌న్నా. ఇప్పుడే మాట్లాడాలంటే చెప్పండి ఫోన్ చేసి ఇస్తా అన్నా. వ‌ద్దులే అని చెప్పి బాత్రూంకు వెళ్లి వ‌చ్చాక మాట్లాడ‌తా అన్నారు. అక్కడికి వెళ్లి కళ్లు తేలేశారు. నేను వెంట‌నే డాక్టర్‌ను పిలిపించా. ఆయన వచ్చి ప‌ల్స్ చూసి ప్రాణాలు లేవమ్మా అన్నారు. ఇదంతా ఐదు నిమిషాల్లోనే జరిగిపోయింది. గతంలో మా ఆయనకు స్టంట్స్‌ వేశారు. వారం రోజుల కింద‌ట ఆసుప‌త్రికి వెళ్లి చెక‌ప్ చేయిస్తే అంతా బాగుంద‌నే వైద్యులు చెప్పారు. ఐతే కొన్ని రోజులుగా ఆయ‌న కాస్త అనారోగ్యంతో ఉన్నారు. షుగ‌ర్ డౌన్ అయింది. అంతకుముందు హుషారుగానే ఉన్నారు. త‌ర్వాత నీర‌స‌ప‌డ్డారు. ఏడాదిన్నర కింద‌టే ఆయ‌న గుంటూరుకు వచ్చేశారు. సినిమాలు త‌గ్గించేశారు. ఎవ‌రైనా బ‌ల‌వంత పెడితే హైద‌రాబాద్‌కు వెళ్లి షూటింగ్ చేసి వ‌చ్చేవారు’’ అని రాధ చెప్పారు.