టాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. చాలామంది పూర్తి స్థాయి నిర్మాతలుగా మారి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఐతే ఇప్పటి దర్శకులు అలా పూర్తిగా రిస్క్ తీసుకోవట్లేదు. తాము తీసే సినిమాల్లో భాగస్వామిగా మారి లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.
వాళ్లకున్న డిమాండ్‌ను బట్టి అది వర్కవుట్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాల్లో నిర్మాతగా ఆయన పేరు పడదు కానీ.. అందులో ఆయన చేసే ప్రతి సినిమాకూ వాటా దక్కుతుంది. రాజమౌళి తీసే సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. సుకుమార్‌కు మైత్రీ సంస్థలో ఇలాగే వాటా దక్కుతోంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా తొలిసారి ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఐతే పోస్టర్ మీద ‘సరెండర్ 2 సినిమా’ అనే బేనర్ పేరును కూడా గమనించవచ్చు. ఇది సురేందర్‌కు సంబంధించిన సంస్థ కావడం విశేషం. సురేందర్ పేరు కలిసొచ్చేలా ఇంగ్లిష్‌లో surrende2cinema అని భలే పేరు పెట్టారు దీనికి. దీని ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్లి చూస్తే ఈ సినిమా కోసమే కొత్తగా మొదలుపెట్టారన్నది స్పష్టం.
సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్.. ఈ దశలో అఖిల్‌తో సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పారితోషకం బదులు పెట్టుబడి లేకుండానే లాభాల్లో మంచి వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి స్థాయిలోనే పెద్ద బడ్జెట్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో అక్కినేని వారు కోరుకుంటున్న మాస్ ఇమేజ్ అఖిల్‌కు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.