పీపుల్స్ స్టార్ ఎప్పటికీ మాట మార్చరు

ఇప్పుడంటే విప్లవ సినిమాల హోరు తగ్గిపోయింది కానీ ఒకప్పుడు 90 దశకంలో ఈ ట్రెండ్ ని సృష్టించి తన పేరుకు ముందు పీపుల్స్ స్టార్ అనిపించుకున్న ఘనత ఆర్ నారాయణమూర్తిదే. మాదాల రంగారావు లాంటి సీనియర్లు ఈ జానర్ లో అప్పటికే పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది మాత్రం మూర్తిగారే. అర్ధరాత్రి స్వాతంత్రం, దండోరా, ఎర్ర సైన్యం లాంటి బ్లాక్ బస్టర్లకు జనం బళ్ళు కట్టుకుని వచ్చేవారు. ఈయన వైభవం ఏ స్థాయిలో ఉండేదంటే దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి లాంటి అగ్ర దర్శకులు చేతులు కలిపేంత.

ఇప్పుడు కనిపించడం తగ్గించేసినా నారాయణమూర్తి గారిది ఒకటే మాట. ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించకూడదని. టెంపర్ టైంలో కానిస్టేబుల్ పాత్ర కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత అడిగినా నిర్మొహమాటంగా నో అనేశారు. జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసినా లాభం లేకపోయింది. చివరికా క్యారెక్టర్ పోసాని కృష్ణమురళికి దక్కింది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా టెంప్ట్ కాలేదు. తాజాగా రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ విషయంలోనూ ఇలాగే జరిగిందని ఫిలిం నగర్ టాక్. అడిగినా సున్నితంగా తిరస్కరించారట.

ఆదాయం ప్లస్ అనుభవం రెండూ వస్తాయనే ఉద్దేశంతో వయసు పెరిగే కొద్దీ హీరోలు సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ కావడం సర్వ సాధారణం. కానీ నారాయణమూర్తి గారు మాత్రం ససేమిరా అంటున్నారు. నష్టం వచ్చినా సరే స్వంతంగా సందేశాత్మక సినిమాలతో సమాజపు పోకడల్ని ప్రశ్నించడం తప్ప ఇంకేదీ చేయనని తెగేసి చెబుతున్నారు. చరణ్ సినిమా ప్రతిపాదన అంతర్గతంగా జరిగింది కాబట్టి నో చెప్పిన విషయం అఫీషియల్ గా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. బిజినెస్ ఎప్పుడో పడిపోయినా దర్శకత్వం నటన రెండూ మానేయనని చెబుతున్న నారాయణమూర్తి ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నారు.