అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర వుందని చెప్పగానే సుషాంత్ అసలేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేసాడు. అంత పెద్ద డైరెక్టర్ సినిమా, అంతటి రీచ్ వున్న హీరో సినిమాలో నటిస్తే తనకు చాలా ప్లస్ అవుతుందని భావించాడు. తీరా అల వైకుంఠపురములో చిత్రంలో అతడిని డమ్మీని చేసేసారు. అతనిపై తీసిన సన్నివేశాలు కూడా ఫైనల్ కట్లో లేపేసారు. దాంతో ఆ చిత్రంలో సుషాంత్ వున్నాడా, లేదా అన్నట్టయింది. ఒక పెద్ద హిట్ సినిమాలో క్యారెక్టర్ చేసాననే శాటిస్ఫాక్షన్ మినహా అతడికేమీ దక్కకుండా పోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ మలి చిత్రం పుష్పలో ఒక కీలక పాత్ర కోసం నారా రోహిత్‌ని సంప్రదించినట్టు సమాచారం. కథ, క్యారెక్టర్ విన్నా కానీ ఇంకా చేస్తాడో, చేయడో రోహిత్ చెప్పలేదట.
హీరోగా బ్రేక్ కోసం చూస్తోన్న తాను ఇప్పుడీ స్పెషల్ క్యారెక్టర్ చేస్తే ఇక తనను హీరోగా చూస్తారో లేదో అనే అనుమానం అతనికి వుందట. పైగా అల వైకుంఠపురములో సినిమాకు సుషాంత్ అనుభవం కూడా అతడిని భయపెడుతోందట. ఇప్పుడు తన పాత్రకు మంచి సీన్లు వున్నా కానీ రేపు లెంగ్త్ సమస్య వస్తే హీరో సీన్లు కాకుండా మిగతా సీన్లే ఎడిట్ అయిపోతాయి. అదే జరిగితే తాను ఈ చిత్రం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదనేది రోహిత్ భయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.