హనుమాన్ కోసం 70 సినిమాలు వదులుకున్నాడట

‘హనుమాన్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తేజ సజ్జ చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. రవితేజకు పూరి జగన్నాథ్, రామ్ చరణ్‌కు రాజమౌళి లాగా తనకు ప్రశాంత్ వర్మ అని స్టేట్మెంట్ ఇస్తే చాలామందికి అతిగా అనిపించింది. అంత పెద్ద హీరోలు, దర్శకులతో తనను, ప్రశాంత్‌ను తేజ పోలుస్తున్నాడేంటి అని సెటైర్లు వేశారు నెటిజన్లు.

కట్ చేస్తే ‘హనుమాన్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో.. తేజకు ఎంత క్రేజ్ తెచ్చిందో తెలిసిందే. హీరోగా అతడి రేంజే మారిపోయింది. స్టార్ డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు అతడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘హనుమాన్’ ఇలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని తేజకు ముందే తెలుసా అన్న చర్చ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హనుమాన్ చేస్తున్న అతను ఏకంగా 70 సినిమాలను రిజక్ట్ చేశాడట.

‘హనుమాన్’ సూపర్ సక్సెస్ అయి మూడు వారాల తర్వాత కూాడా మంచి వసూళ్లతో సాగిపోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమాన్ చేస్తున్న సమయంలోనే తాను 70కి పైగా కథలు విన్నట్లు చెప్పాడు. అందులో 15-20 దాకా మంచి కథలు ఉన్నాయని.. కానీ తన ఫోకస్ పూర్తిగా హనుమాన్ మీదే ఉండాలన్న ఉద్దేశంతో కొత్తగా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదని చెప్పాడు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్ల పాటు కష్టపడ్డానని.. అందులో ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా డూప్ సాయం లేకుండా సొంతంగా చేశానని.. ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతోందని తేజ తెలిపాడు. హనుమాన్ సక్సెస్ అవుతుందని తెలుసని.. కానీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అతను వ్యాఖ్యానించాడు.