వరుణ్ సినిమా మళ్లీ వాయిదా

మెగా కుర్రాడు వరుణ్ తేజ్‌కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. స్యూర్ షాట్ హిట్ అనుకున్న ‘ఎఫ్-2’ ఫ్రాంఛైజీ మూవీ ‘ఎఫ్-3’ తేడా కొట్టేసింది. ఆ తర్వాత వరుణ్ సోలో హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున్’ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ వరుణ్ మార్కెట్‌ను బాగానే దెబ్బ తీసింది. మరోవైపు బాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ నిర్మాణంలో చేసిన భారీ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎంతకీ బయటికి రావట్లేదు.

డిసెంబరు 8నే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి సినిమాను రెడీ చేయలేక ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు. ఇప్పుడు ఈ డేట్‌కు కూడా సినిమా రాదని తేలిపోయింది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా చిత్ర బృందం పబ్లిసిటీ ఏమీ చేయకపోవడాన్ని బట్టే విషయం అర్థమైపోయింది.

‘ఆపరేషన్ వాలెంటైన్’ 16న రావట్లేదన్నది పక్కా. ఇక వేసవి రిలీజ్ గురించి ఆలోచిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్ల వాయిదా అని చెబుతున్నప్పటికీ.. సినిమాకు సరైన బజ్ లేకపోవడం, బిజినెస్ జరక్కపోవడం కూడా కారణాలై ఉంటాయనే చర్చ జరుగుతోంది.

ఈ సినిమా ప్రకటించిన దగ్గర్నుంచి పెద్దగా హైప్ లేదు. నిర్మాణ సంస్థ మనది కాదు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కూడా ఇక్కడి వాడు కాదు. హీరోయిన్ మానుషి చిల్లర్ కూాడా బాలీవుడ్ అమ్మాయే. కథాంశం కూడా మనకు సూటయ్యేలా లేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఇప్పటిదాకా పెద్దగా ఓన్ చేసుకోలేదు. వరుణ్ ఫ్లాపుల్లో ఉండడం కూడా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం కూడా ప్రతికూలంగా మారుతోంది. సాధ్యమైనంత త్వరగా రిలీజ్ డేట్ ఖరారు చేసి, ప్రమోషన్ల జోరు పెంచి, ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే తప్ప సినిమాకు హైప్ రావడం కష్టమే.