ఈ ఏడాది భారీ అంచనాలున్న ప్యాన్ ఇండియా మూవీగా పుష్ప 2 ది రూల్ మీద మైత్రి మూవీ మేకర్స్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టే నార్త్ నుంచి సౌత్ దాకా బిజినెస్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అలా అని నిర్మాతలు తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఓటిటి హక్కుల విషయంలో మొహమాటానికి పోకుండా మొదటి భాగం కొన్న అమెజాన్ ప్రైమ్ ని కాదని భారీ మొత్తాన్ని కోట్ చేసిన నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ రైట్స్ ఇచ్చేశారు. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి తట్టుకోలేక మార్చిలో మాట్లాడుకుందామని ఫోన్ లో తెగేసి చెబుతున్నారట.
వీటి సంగతలా ఉంచితే ఒక కీలక లీక్ మంచి కిక్ ఇచ్చేలా ఉంది. కథ ప్రకారం పుష్పరాజ్ జపాన్ వెళ్తాడట. ఎందుకంటే ఎర్రచందనం రవాణాకు సంబంధించి ఒక డీల్ మాట్లాడేందుకు అక్కడి డాన్ ను కలుసుకుంటాడు. కానీ తీరా ఒప్పందం కుదిరే టైంలో అక్కడున్న గ్యాంగ్ కుట్ర చేయడంతో పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా కింగ్ పిన్ ని అక్కడే చంపేసే ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. వయొలెన్స్ ఎక్కువ ఉంటుందని, ఒకరకంగా చెప్పాలంటే యానిమల్ ఇంటర్వెల్ బ్లాక్ ని మించి ఇది మెప్పిస్తుందని యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు.
ఇది నిజమని నిర్ధారించడానికి సుకుమార్ చెప్పింది కాదు కానీ సమాచారమైతే విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిందే. ఇక్కడ చెప్పిన పాయింట్ చాలా చిన్నది. ఇంతకు మించిన గూస్ బంప్స్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయట. ముఖ్యంగా అల్లు అర్జున్ చీరకట్టుకునే జాతర యాక్షన్ బ్లాక్ నభూతో నభవిష్యత్తు అంటున్నారు. జపాన్ ఫైట్ దాదాపు ఇక్కడి సెట్స్ లోనే తీశారని తెలిసింది. విజువల్స్ సహజమనిపించేలా సుక్కు పెద్ద ఎత్తున సాంకేతిక నిపుణులతో పని చేయిస్తున్నాడు. ఆగస్ట్ 15 విడుదలను ప్రకటించుకున్న పుష్ప 2 ది రూల్ వాయిదా పడొచ్చేమోననే టాక్ ఉంది కానీ టీమ్ మాత్రం తగ్గేదేలే అంటోంది.