కుర్చీ మడత పాట ముందు అనుకోలేదా

గుంటూరు కారంని ఇంత ఘనంగా నిలబెట్టిన వాటిలో కుర్చీ మడత పాట ఒకటి. మహేష్ బాబు, శ్రీలీల హుషారైన స్టెప్పులతో పాటు బొద్దుగా ఉన్న పూర్ణ మినీ క్యామియో మాస్ కి బాగా ఎక్కేసింది. నిజానికి ఈ పాట వెనుకో పెద్ద ట్విస్టు ఉంది. క్లైమాక్స్ కు ముందు ఒక మసాలా పాట కావాలనుకున్నప్పుడు ముందు రికార్డింగ్ చేయించిన సాంగ్ వేరు. దాని చిత్రీకరణ మొదలుపెట్టి మధ్యలో ఆపేశారట. ఎందుకో ట్యూన్, షూట్ చేస్తున్న విధానం రెండూ మహేష్ కు నచ్చలేదు. ఇదేదో మైనస్ అయ్యేలా ఉందని చెప్పి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడి అప్పటికప్పుడు కుర్చీ మడతకు శ్రీకారం చుట్టారట.

దీనికి ప్రూఫ్ కూడా ఉందండోయ్. రిలీజ్ కు కొద్దిరోజుల క్రితం మహేష్, శ్రీలీల డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి లీకై సోషల్ మీడియాలో తిరిగింది. కాస్ట్యూమ్స్ కూడా కొంచెం వేరుగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట, స్టెప్స్ డిఫరెంట్ గా అనిపిస్తాయి. దాన్ని క్యాన్సిల్ చేసే ఇప్పుడు మనం వింటున్న చూస్తున్న కుర్చీ మడతపెట్టి వచ్చి చేరిందట. ఇది అఫీషియల్ గా చెప్పింది కాకపోయినా యూనిట్ నుంచి అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. ఏది ఏమైనా ఇది నిజమైతే మాత్రం మహేష్ మాస్ సెన్స్ ని మెచ్చుకోవలసిందే. అంత ఖచ్చితంగా ముందే గుర్తుపట్టినందుకు.

వంద కోట్ల షేర్ దాటేసిన గుంటూరు కారం ఇంకా బ్రేక్ ఈవెన్ కి చెప్పుకోదగ్గ దూరంలోనే ఉంది. సంక్రాంతి సెలవులు అయిపోయిన నేపథ్యంలో వసూళ్లు ఏ మేరకు తగ్గుతాయనేది కీలకం కాబోతోంది. నైజామ్ లో తగ్గించిన టికెట్ రేట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. వంద రూపాయలు తగ్గుతుంది కాబట్టి ఒక్కసారిగా ఊపందుకుంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు కానీ ఇదేదో ముందే చేయాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు హనుమాన్ దూకుడు భీభత్సంగా ఉండగా నా సామిరంగ సైతం మాస్ ని బలంగా లాగుతున్నాడు. సో వెంకటరమణకి అసలు పరీక్ష షురూ.