థియేటర్ల వ్యవహారం – నిర్మాతల మండలి సీరియస్

నివురు గప్పిన నిప్పులా ప్రొడ్యూసర్ల మధ్యే ఉన్న థియేటర్ల రచ్చ ఇప్పుడు నిర్మాతల మండలి సాక్షిగా అధికారికంగా బహిర్గతమయ్యింది. హనుమాన్ పంపిణి హక్కులు కొన్న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ జనవరి 12 నుంచి తమ సినిమాకు అగ్రిమెంట్లు చేసుకున్న కొందరు నైజామ్ ఎగ్జిబిటర్లు నిబంధనలు ఉల్లంఘించి తమది ప్రదర్శించకుండా వేరేవవాటికి ఇచ్చారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయడంతో మీడియాకు అఫీషియల్ గా సమాచారం ఇచ్చారు. దీని వల్ల కలిగిన నష్టాన్ని భరించడంతో పాటు వెంటనే హనుమాన్ ని ప్రదర్శించాలని సదరు ప్రెస్ నోట్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

హనుమాన్ థియేటర్లకు జరిగిన అన్యాయం గురించి మైత్రి, ఏషియన్ మధ్య రేగిన వివాదం నిన్న హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గుంటూరు కారంకి ప్రాధాన్యత ఇచ్చారని, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాబట్టి ఆయనదే బాధ్యత అన్నట్టు కొందరు కామెంట్ చేశారనే గుసగుస ఫిలిం నగర్ వర్గాల్లో వినిపించింది. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని కాసేపు మాట్లాడిన దిల్ రాజు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటికీ లెటర్ బయటికి రాలేదు.

తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. నైజామ్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ హనుమాన్ కి థియేటర్ల కొరత విపరీతంగా ఉంది. బుక్ మై షోలో ఒక్క టికెట్ దొరకడం లేదు. రేపటికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మిగిలిన వాటికి రెస్పాన్స్ లేకపోయినా భారీ ఎత్తున షోలు బ్లాక్ చేసి పెట్టారని మూవీ లవర్స్ వాపోతున్నారు. మరి దీని పట్ల ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంతకీ ఒప్పందం తూచ్ అన్న థియేటర్లు ఏవో వాటి వివరాలేంటో అందులో పేర్కొనలేదు. బ్లాక్ బస్టర్ అయినా హనుమాన్ కి ఈ కష్టాలు ఏంటో మరి.