త్రివిక్రమ్ పొలిటికల్ ముద్ర కనిపించింది

గుంటూరు కారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ప్రమోషన్లలో ఎక్కువగా కనిపించలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు వంద శాతం కోరుకుంటే రెండు వందల శాతం ఇచ్చే స్టారని కితాబివ్వడం అభిమానులకు మంచి కిక్కిచ్చింది. తమ హీరో పట్ల ఉన్న ప్రేమని చూసి పొంగిపోయారు. ఇంతే స్థాయిలో త్రివిక్రమ్ విపరీతంగా ఇష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకి దీనికీ కనెక్షన్ ఏంటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. గుంటూరు కారం కథ ప్రధానంగా ప్రకాష్ రాజ్ పొలిటికల్ పార్టీ చుట్టూ తిరుగుతుంది. ఆయనంటే ఇష్టం లేని మనవడే వెంకటరమణ అలియాస్ మహేష్.

ఇందులో సదరు పార్టీ పేరు జెడిపి (JDP) అని పెట్టారు. అంటే డీ కోడింగ్ చేస్తే జనసేన ప్లస్ టీడీపీ అని అర్థం తీయొచ్చు. ఇంత అలోచించి ఉంటారా అంటే చెప్పలేం. ఎందుకంటే త్రివిక్రమ్ నేరుగా పవన్ తో రాజకీయ ప్రయాణం చేయడం లేదు కానీ ఇద్దరి మధ్య దీనికి సంబంధించిన ఆలోచనలు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు స్పీచులు వింటే వాటిని త్రివిక్రమ్ రాసిచ్చారా అనే అనుమానం కలుగుతుందని నెటిజెన్లు పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేయడం చూసాం. కాబట్టి పొత్తుని దృష్టిలో పెట్టుకునే పార్టీ పేరు జెడిపి అని పెట్టి ఉండొచ్చు. ఖచ్చితమని ఎవరూ చెప్పరు.

దీని సంగతలా ఉంచితే గుంటూరు కారంలో పొలిటికల్ రెఫరెన్సులు స్ట్రాంగ్ గా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. కొన్ని సెటైర్లు కూడా గట్టిగా పడ్డాయట. నేరుగా పేర్లను ప్రస్తావించకపోయినా అధికారం ముసుగులో పార్టీలు చేస్తున్న తప్పులను ఎండగట్టినట్టు చెబుతున్నారు. స్క్రీన్ మీద అవి చాలా బాగా వచ్చాయని వినికిడి. ప్రకాష్ రాజ్ పార్టీ, రమ్యకృష్ణ ఫ్లాష్ బ్యాక్, మహేష్ బాబు వీళ్ళ మధ్యలోకి రావడం, జగపతి బాబుతో శత్రుత్వం ఈ ప్రధాన అంశాల చుట్టూ గుంటూరు కారం స్టోరీ తిరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం అత్తారింటికి దారేది రేంజ్ లో ఉంటుందని లీక్స్ కొన్ని తెగ చక్కర్లు కొడుతున్నాయి.