పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలన్నది చాలామంది రచయితలు, దర్శకుల కల. కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. అలా కల కన్న చాలామంది ఇక తమ కలలకు తెరపడినట్లే అనుకున్నారు ‘అజ్ఞాతవాసి’ తర్వాత. ఆ సినిమా చేశాక రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్.. ఒక దశలో సినిమాలు పూర్తిగా మానేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఐతే ఆ నిరాశను ఎక్కువ కాలం కొనసాగనివ్వకుండా గత ఏడాది రీఎంట్రీకి రెడీ అయిపోయాడు పవన్. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమాలోనూ నటిస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల చిత్రాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు చెబుతున్నారు.
పవన్ చేస్తున్న, చేయబోయే సినిమాల్లో ఒక విషయం కామన్‌గా కనిపిస్తోంది. ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాలు, ఏదో ఒక సందేశం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ మాతృక ‘పింక్’ మహిళల సమస్యల నేపథ్యంలో నడిచేదన్న సంగతి తెలిసిందే. ఇక క్రిష్ తాను తీసే ప్రతి చిత్రంలోనూ సామాజిక కోణం కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. హరీష్ శంకర్ లాంటి మాస్ డైరెక్టర్ సైతం ఈసారి సందేశం మిళితం చేసిన కథను పవన్ కోసం రెడీ చేశాడని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.
పవన్ ఇప్పుడు కేవలం నటుడు కాదు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. అలాంటపుడు ఇంతకుముందులా కేవలం వినోదానికి పరిమితమయ్యేు పరిస్థితి లేదు. అందులోనూ మళ్లీ సినిమాలు చేయడం పట్ల విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాల ద్వారా ఎంతో కొంత మంచి చెప్పాలని, తన రాజకీయ భావజాలాన్ని కూడా జొప్పించే ప్రయత్నం చేయాలని పవన్ చూస్తున్నట్లుంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌తో సినిమా చేయాలని ఆశిస్తున్న వాళ్లందరూ తమ కథల్లో సామాజిక అంశాలు, సందేశం ఉండేలా చూసుకుంటే ఈజీగా ఛాన్స్ అందుకునే అవకాశం ఉంటుందన్నమాట.