పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం ఘనంగా సన్నాహాలు జరుగుతున్న సమయంలో నిన్న సాయంత్రం ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ చిత్తూరు జిల్లాలో శాంతిపురంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదలడం విషాదాన్ని నింపింది. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు కావడం, వాళ్లను నమ్ముకున్న కుటుంబం అన్యాయం అయిపోవడం బాధాకరం.
ఈ ఉదంతం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నాడు. జనసేన పార్టీ తరఫున సాయం కూడా ప్రకటించాడు. ఐతే ఈ అభిమానులకు పవన్ మాత్రమే కాక వేరే వాళ్లు కూడా సాయానికి ముందుకు వచ్చారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాల బృందాలూ ఆర్థిక సాయం ప్రకటించాయి.
‘వకీల్ సాబ్’ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. వీరికి తోడు అల్లు అర్జున్ సైతం ఆర్థిక సాయానికి ముందుకు రావడం గమనార్హం. పవన్ అభిమానుల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన బన్నీ.. తన వంతుగా వారికి రెండేసి లక్షల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.
కొన్నేళ్లుగా పవన్ అభిమానులకు బన్నీ అంటే గిట్టట్లేదు. ‘సరైనోడు’ ఆడియో వేడుకలో ‘చెప్పను బ్రదర్’ కామెంట్ చేయడం, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో బన్నీ ప్రవర్తన పవన్ అభిమానులకు నచ్చలేదు. పలు సందర్భాల్లో బన్నీపై తమ వ్యతిరేకతను చూపించారు కూడా. ఐతే వాళ్లతో ప్యాచప్ కోసం బన్నీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల కుటుంబాలకు బన్నీ సాయం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చిరంజీవి, సాయిధరమ్ తేజ్ సైతం పవన్ అభిమానుల మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates