పవన్ ప్రి లుక్‌తోనే గూస్ బంప్స్

PSPK 27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు, నటించబోయే ఓ సినిమా నుంచి విశేషాలు బయటికి రాబోతున్నట్లు ముందే ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే ‘వకీల్ సాబ్’ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. అది అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా పవర్‌ఫుల్‌గా కనిపించడంతో పవన్ అభిమానులు ఖుషీ అయ్యారు.

ఇక మధ్యాహ్నానికి మరో ట్రీట్ రెడీ అయిపోయింది. పవన్ 27 సినిమా నుంచి ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌యే స్వయంగా ప్రి లుక్ రిలీజ్ చేశాడు. పవన్ ముఖం ఏమీ చూపించకుండానే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఈ లుక్ డిజైన్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లే చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. పవన్ ఒక యోధుడిలాగా కనిపించబోతున్నాడని స్పష్టమవుతోంది.

పవన్ ఒంటి మీద ఉన్న ప్రాపర్టీస్‌తోనే ఈ లుక్ చాలా రాయల్‌గా ఉండబోతోందని సంకేతాలు ఇచ్చింది ప్రి లుక్. కచ్చితంగా అభిమానుల్ని మురిపించేలా పవన్ పాత్ర ఉంటుందనిపిస్తోంది. ఈ లుక్ షేర్ చేస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారు #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan’’ అని ట్వీట్ చేశాడు క్రిష్.

పవన్‌తో ఖుషీ, బంగారం సినిమాలు తీసిన ఎ.ఎం.రత్నం చాలా ఏళ్ల విరామం తర్వాత అతడితో ఈ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు ప్రచారం జరిగినట్లే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ఖరారైంది. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. మాటలు సాయిమాధవ్ బుర్రా రాస్తున్నాడు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్.