రామాలయ ప్రారంభం ‘హనుమాన్’కి లాభమా

వచ్చే సంవత్సరం తొలి నెల జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం కాబోతోంది. అత్యంత అట్టహాసంగా, వైభవోపేతంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా దీన్ని నిర్వహించేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. లైవ్ టెలికాస్ట్ తో పాటు వారం రోజులు ముందు నుంచే దేశవ్యాప్తంగా రామనామస్మరణ మారుమ్రోగేలా పలు గుడుల్లో కార్యక్రమాలు చేయబోతున్నారు. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, చిరంజీవి, ధనుష్, రిషబ్ శెట్టి, రజినీకాంత్ తదితరులకు ఆహ్వానాలు వెళ్ళబోతున్నాయని ముంబై టాక్. ఈ లిస్టు ఇంకా పెరుగుతుంది.

దీనికి జనవరి 12 విడుదల కాబోతున్న హనుమాన్ కి కనెక్షన్ ఏంటంటే సర్వత్రా రాముడి జపమే జరుగుతున్న టైంలో ఆయన వీర భక్తుడి కథను విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తీసుకొస్తున్న ప్రశాంత్ వర్మ బృందం ఈ సెంటిమెంట్ తమకు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మహేష్, రవితేజ, వెంకటేష్, నాగార్జునల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. సో టాక్ కనక పాజిటివ్ వస్తే మాత్రం హిందీ వెర్షన్ రిలీజయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కోల్కతా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హనుమాన్ సునామి మాములుగా ఉండదు.

గతంలో నిఖిల్ కార్తికేయ 2 ఇలాగే ట్రెండ్ ని క్యాష్ చేసుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు హనుమాన్ అంతకు మించి అనేలా ఉంటుందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అనూహ్యంగా బాలీవుడ్ బయ్యర్ల నుంచి మంచి రేట్లతో డిమాండ్ వస్తుండటంతో థియేట్రికల్ డీల్స్ తోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామాలయ ప్రారంభం ఒక గొప్ప అధ్యాయంగా ప్రచారం జరుగుతున్న టైంలో ఫాంటసీ అయినా సరే హనుమాన్ కథను తెరమీద చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారనే అంశాన్ని కొట్టిపారేయలేం. జస్ట్ సినిమా బాగుందనే మాటొస్తే చాలు.