ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. మన దగ్గర అంతగా ఉండదు కానీ తమిళనాడులో సంబరాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలా అని తెలుగులో ఫాలోయింగ్ లేదని కాదు. సరైన మూవీ పడితే వసూళ్ల ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో ఇటీవలే జైలర్ నిరూపించింది. తెలుగు రాష్ట్రాల నుంచే నలభై కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఇప్పుడు ఆయన చేస్తున్న 170వ సినిమా తాలూకు తమిళ టైటిల్ చిన్న టీజర్ ద్వారా ఇందాకా విడుదల చేశారు. కథ గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు కానీ తలైవా ఎలా ఉంటారనే క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం పేరు వెట్టయన్. అంటే వేటగాడు.
జైలర్ తరహాలోనూ ఇందులో రజనీకాంత్ గెటప్ కనిపిస్తోంది. కాకపోతే మనవడున్న వయసు మళ్ళిన తాతగా కాకుండా కాస్త మిడిల్ ఏజ్ టచ్ ఇచ్చారు. వేటగాడులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం ఆల్రెడీ లీకైపోయిన ఇందులో మరోసారి క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత రజని, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్నారు. అంతే కాదు రానా, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రావు రమేష్, రితిక సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ నుంచి మరోసారి అదిరిపోయే బీజీఎమ్ ఆశించవచ్చు.
సూర్యతో జై భీమ్ తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న టి జె జ్ఞానవేల్ ఈ వెట్టయన్ కు దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది. ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన ఒక ఎన్కౌంటర్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. సీరియస్ డ్రామానే అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు కొదవ లేకుండా చూస్తున్నారట. జైలర్ తర్వాత ఒక్కసారిగా రజినీకాంత్ మార్కెట్ పుంజుకోవడంతో నిర్మాణంలో ఉన్న ఆయన సినిమాలకు డిమాండ్ వస్తోంది. దీనికన్నా ముందు వచ్చే సంక్రాంతికి లాల్ సలామ్ లో ముస్లిం లీడర్ గా కనిపిస్తారు. ఈ వేటగాడు రిలీజ్ దీపావళికి జరిగే అవకాశాలున్నాయి.