నానికి తొమ్మిదో మిలియన్ మైలురాయి

ఓవర్సీస్ లో నానికి ఎంత పట్టుందో మరోసారి ఋజువయ్యింది. హాయ్ నాన్న మొదటి వారం పూర్తి కాకుండానే మిలియన్ క్లబ్బులోకి చేరిపోయింది. దీంతో మొత్తం 9 న్యాచురల్ స్టార్ సినిమాలు ఈ మైలురాయి అందుకుని అరుదైన ఘనతను అందించాయి. ఇంతకు ముందు భలే భలే మగాడివోయ్, అంటే సుందరానికి, జెర్సీ, నిన్ను కోరి, ఎంసిఏ మిడిల్ క్లాస్ అబ్బాయి, నేను లోకల్, ఈగ, దసరాలు ఈ ఫీట్ చేరుకోగా తాజాగా హాయ్ నాన్న వీటి సరసన చేరింది. ఇంకా లాంగ్ రన్ దూరంలో ఉంది కాబట్టి సులభంగా రెండు మిలియన్ మార్కు కొట్టొచ్చని బయ్యర్ల నమ్మకం.

ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో మహేష్ బాబు తర్వాత స్థానం నానిదే అవుతుంది. సూపర్ స్టార్ ఖాతాలో ఇప్పటిదాకా 11 మిలియన్ మూవీస్ ఉన్నాయి. గుంటూరు కారం ఖచ్చితంగా పన్నెండోది అవుతుంది. మిగిలిన హీరోలు వీళ్ళ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దీన్ని బట్టే నానికి యుఎస్ లో అంత బలమైన మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విడుదల రోజే అమెరికా ప్రయాణం పెట్టుకున్న నాని దానికి తగ్గట్టే అక్కడి ఆడియన్స్ ని కలుస్తూ, థియేటర్ విజిట్స్ చేస్తూ, అభిమానుల్లో ఉత్సాహం రేపుతున్నాడు. సలార్ వచ్చే దాకా హాయ్ నాన్నకు అక్కడ ఎలాంటి బ్రేకులు లేవు.

ఇక తెలుగు రాష్ట్రాల సంగతికొస్తే వీకెండ్ మూడు రోజులు హాయ్ నాన్నకు చాలా పికప్ కనిపిస్తోంది. ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం, యానిమల్ సెకండ్ వీక్ రన్ వల్ల సరిపడా షోలు దొరకడం లేదన్న మాట వాస్తవం. నిర్మాతలు ఈ దిశగా ఆదివారం షోలు పెంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల దాదాపు అన్ని చోట్ల అడ్వాన్స్ లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. సోమవారం నుంచి ఎంత డ్రాప్ ఉంటుందనే దాన్ని బట్టి చివరి ఫలితం ఆధారపడి ఉంటుంది. దసరా తర్వాత హాయ్ నాన్న నానికి మరో హిట్టుని అందించేసింది.