ఇరకాటంలో పడ్డ పుష్ప బృందం

నిన్న నటుడు జగదీశ్ ని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం దక్కించుకున్న టైంలో మైత్రి లాంటి పెద్ద బ్యానర్ తనతో సత్తిగాని రెండెకరాలు లాంటి ఓటిటి మూవీని మంచి బడ్జెట్ తో నిర్మించింది. దాని ఫలితంతో సంబంధం లేకుండా చక్కని అవకాశాలు పట్టుకొచ్చింది. అయితే ఒక జూనియర్ ఆర్టిస్టుని చనిపోయేలా ప్రేరేపించాడన్న కారణంగా ఇలా కటకటాల పలివ్వడంతో ఒక్కసారిగా దర్శకుడు సుకుమార్ బృందానికి ఎక్కడ లేని ఇరకాటం వచ్చి పడింది.

అసలే పుష్ప 2 ది రూల్ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ఇప్పటికే లేట్ అయినా అతి కష్టం మీద ఆర్టిస్టుల డేట్లను బాలన్స్ చేసుకుంటూ సుకుమార్ నెలల తరబడి తీస్తూనే ఉన్నారు. ఇంకా కీలక భాగం పెండింగ్ ఉంది. పుష్ప స్నేహితుడిగా జగదీష్ అవసరమున్న సీన్లు పెద్ద ఎత్తున ఉన్నాయట. ఎక్కడికి పోడనే ధైర్యంతో సుక్కు టీమ్ తన విషయంలో టెన్షన్ పడలేదు. తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసే కానీ అది వీలైనంత త్వరగా వస్తేనే టెన్షన్ తగ్గుతుంది. అర్ధాంతరంగా వేరే ఆర్టిస్టుని తీసుకోవడానికి ఇది సీరియల్ కాదు, ప్యాన్ ఇండియా మూవీ.

ఆ అమ్మాయి మరణంలో జగదీశ్ ప్రమేయం ఎంతమేరకు ఉందనే దాని మీద పోలీసులు గట్టి ఆధారాలు సేకరించారని వినిపిస్తోంది. న్యాయస్థానం వాటిని కూలంకుషంగా పరిశీలించి నిజానిజాలు నిర్ధారించడానికి టైం పట్టొచ్చు. మరి బెయిల్ ఎంత త్వరగా వస్తుందనేది కీలకం. అదే జరిగితే మాత్రం ముందు తనతో షూట్ ని పూర్తి చేసేందుకు సుకుమార్ ప్రాధాన్యం ఇస్తాడు. అయినా కెరీర్ ని చక్కగా సరిచేసుకునే టైంలో చేతులారా చేసుకున్న ఈ డ్యామేజ్ జగదీశ్ భవిష్యత్తుని ప్రభావితం చేసేదే. పుష్ప కోసం డేట్లన్నీ దానికే కేటాయించిన అతనికి ఇకపై ఆఫర్లు ఏ దారి పడతాయో.