పవన్ నిర్మాతలకు క్లారిటీ వచ్చింది

నిన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలంగాణలో జనసేన ప్రభావం పట్ల పార్టీకి పూర్తి క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషం దాకా నాన్చి బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల జరిగిన నష్టం స్పష్టంగా కనిపించింది. ఇక ఏపీ ఎన్నికల్లో టిడిపితో కలిసి నడవాల్సి ఉన్నందున ఇకపై ప్రణాళికలు ఎంత జాగ్రత్తగా ఉండాలో పవన్ కళ్యాణ్ కు తేటతెల్లమైపోయింది. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వస్తాయి. అధికార బిఆర్ఎస్ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చినట్టు ఏపీలోనూ జారగొచ్చనే విశ్లేషణలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ మరింత యాక్టివ్ గా రణక్షేత్రంలో ఉండాలి.

తక్కువో ఎక్కువో కాసిన్ని డేట్లు ఇస్తే వీలైనంత షూటింగ్ చేసుకుందామని ఎదురు చూస్తున్న ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు మ్యాటర్ అర్థమైపోయింది. పవన్ ఇప్పట్లో సెట్లకు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబునాయుడు కూడా బయటికి వచ్చేశారు కాబట్టి ఇకపై ఉమ్మడి స్ట్రాటజీలు, ప్లానింగులు, చర్చలు,యాత్రలు, పరస్పర మద్దతులు ఇలా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. వారాహికి చాలా గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఇంత టఫ్ షెడ్యూల్ లో షూటింగులంటే ప్లానింగ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. అందుకే ఆగాల్సిందే.

ఈ లెక్కన ఒకవేళ టిడిపి-జనసేన కనక అధికారంలోకి వస్తే పవన్ నిర్మాతల వెయిటింగ్ టైం ఇంకా పెరుగుతుంది. లేదూ సానుకూల ఫలితం రాలేదంటే మే నుంచే నిక్షేపంగా షెడ్యూల్స్ మొదలుపెట్టుకోవచ్చు. ఇదంతా ముందస్తుగా తేలే విషయం కాదు కాబట్టి క్రికెట్ మ్యాచ్ లాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉండటం తప్ప ఎవరేం చేయలేరు. 2024 వేసవిలో లోగా పవన్ కొత్త సినిమా థియేటర్లో చూసుకోవచ్చని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పదు. మహా అయితే దసరా లేదా దీపావళి కన్నా ముందు రిలీజులు ఉండే ఛాన్స్ లేదు. సో ఇక పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సిందే.