తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు గురువారం ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. సినీరంగంలో లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్న హీరోలు, ఇతరనటులు, సంగీత దర్శకులు కూడా పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేశారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న చిరంజీవి.. సతీమణి సురేఖ, కుమార్తెతో కలిసి.. పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవిని అప్పయ్య దీక్షలో చూసిన అభిమానులు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు రాగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి, మాతృమూర్తితో కలిసి ఉదయాన్నే పోలింగ్ బూత్ వద్ద దర్శన మిచ్చారు. వీరు కూడా.. లైన్‌లో నిలబడిఓటు హక్కు వినియోగించుకున్నారు. విక్టరీ హీరో వెంకటేష్.. కూడా ఓటు వేసినట్టు తన ఇన్‌స్టాలో ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్టు చేశారు.
అల్లు అర్జున్ కొద్దిసేపు పోలింగ్ బూత్ వద్ద సందడి చేశారు. తనను చూసేందుకు వచ్చిన వారిని ఆయన పలకరించారు. కొందరితో సెల్ఫీలు కూడా దిగారు. క్యూలైన్‌లో నిలబడిన వృద్ధులకు ఆయన ముందు అవకాశం ఇస్తూ.. తాను వెనక్కి వచ్చారు. చాలా సేపు క్యూలైన్ వద్దే ఉండి.. పరిస్థితిని ఆయన గమనించడం విశేషం. ఇక, సంగీత దర్శకుడు కీరవాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోవడం.. ప్రతి ఒక్కరి కర్తవ్యమని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates