నాన్న భుజాల మీద భారం ఎంత

ఇంకో తొమ్మిది రోజుల్లో హాయ్ నాన్న వచ్చేస్తాడు. ప్రమోషన్ మొత్తం తానై చూసుకుంటున్న నాని పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ మీడియా, ఫ్యాన్స్ ని కలుస్తున్నాడు. ట్రైలర్ వచ్చాక కంటెంట్ ఎలాంటిదో క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్న వైనం స్పష్టంగా కనిపించింది. డేట్ల సమస్య వల్ల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లేకుండానే ఇవన్నీ నడిపించడం కొంత ఇబ్బందిగానే ఉన్నప్పటికీ నాని ఒకే ఒక్కడు తరహాలో చేసుకుంటూ పోతున్నాడు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ బరిలో నుంచి తప్పుకున్నా నాని మీద భారం వివిధ రూపాల్లో ఉంది.

డిసెంబర్ 1న రాబోయే యానిమల్ టాక్ నెక్స్ట్ వచ్చే హాయ్ నాన్న మీద ప్రభావం చూపించే రిస్క్ లేకపోలేదు. తెలుగులో ఏమో కానీ ఇతర భాషల్లో మాత్రం అది పెద్ద అడ్డంకే. కుటుంబ ప్రేక్షకులను ఇట్టే లాగే కెపాసిటీ ఉన్న నానికి ఈసారి మాస్ ని మొదటి వారంలో థియేటర్ కు వచ్చేలా చేయడం అసలైన సవాల్. పైగా ఒక్క రోజు గ్యాప్ తో వస్తున్న నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ ప్లస్ యాక్షన్ సరుకుతో వస్తోంది. హాయ్ నాన్నలాగా సున్నితమైన ప్రేమకథ, పాప ఎమోషన్లు వగైరాలు ఉండవు. సో దానికి హిట్ టాక్ వస్తే మాత్రం బిసి సెంటర్లలో చిక్కొస్తుంది.

ఇలా రెండు వైపులా ఉన్న పోటీని నాని కాచుకోవాల్సి ఉంటుంది. యునివర్సల్ ఎమోషన్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ నెంబర్లు గట్రా తర్వాత తెలుస్తాయి కానీ సీడెడ్ లాంటి ప్రాంతాల్లో దసరా కంటే తక్కువ రేట్లకు అడిగారనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి ఉంది. అసలే డిసెంబర్ ఒకరకంగా డ్రై నెల. క్రిస్మస్ నుంచి తప్ప బాక్సాఫీస్ వద్ద అంత ఊపు ఉండదు. హాయ్ నాన్న ఏం చేసినా రెండు వారాల్లోనే రాబట్టుకుని సర్దాలి. 21, 22 వరసగా డంకీ, సలార్ లు వచ్చాక సైడ్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు.